హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 1 : భారీ వర్షాలతో వరంగల్ రీజియన్ పరిధిలో 208 బస్సులను రద్దు చేసినట్లు ఆర్ఎం విజయభాను తెలిపారు. కటాక్షపూర్ చెరువు మత్తడి పోస్తుండడంతో ఏటూరునాగారం, మంగపేట వైపు బస్సులను నిలిపివేసినట్లు, అలాగే నర్సంపేట-వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, తొర్రూరు-హైదరాబాద్ మీదుగా నడిపే బస్సులను రద్దు చేసినట్లు చెప్పారు.
కేసముద్రం ఇంటికన్నె వద్ద రైల్వే పట్టాలకు గండిపడడంతో అక్కడే చిక్కుకుపోయిన సుమారు 4 వేల మంది ప్రయాణికుల కోసం కేసముద్రం నుంచి 20 బస్సులు నడిపించినట్లు తెలిపారు. 28 బస్సులను ఇతర రూట్లలో పంపించామని, మొత్తం 37 రూట్లలో 208 బస్సులను రద్దు చేయడంతో రూ.40 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. రంగశాయిపేట రెసిడెన్సీ స్కూల్లో చిక్కుకున్న విద్యార్థులను రెండు బస్సుల ద్వారా సురక్షితంగా తరలించామని చెప్పారు.