నర్సంపేట రూరల్, ఫిబ్రవరి 9: నియోజకవర్గంలో 135 మంది కార్మికులకు రూ. 7.70 కోట్ల పెండింగ్ క్లెయిమ్స్ విడుదలైనట్లు బీఆర్ఎస్కేవీ రాష్ట్ర నాయకురాలు నల్లా భారతీరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజ్ తెలిపారు. పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గంలోని 135 మంది భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లెయిమ్స్ (సహజ మరణం, వివాహం, డెలివరీ) కోసం రూ. 7,70,08,130 మంజూరైనట్లు వెల్లడించారు. గత రెండేళ్ల నుంచి కొన్ని సాంకేతిక కారణాల వల్ల భవన నిర్మాణ కార్మికులకు రావాల్సిన క్లెయిమ్స్ పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు.
ఆయన వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారన్నారు. నిర్మాణ రంగాల్లో పని చేస్తున్న కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం లేబర్ శాఖ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. కార్మికుల సంక్షేమ పథకాల కోసం దళారుల వద్దకు వెళ్లకుండా నేరుగా లేబర్ కార్యాలయానికి వెళ్లి అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు ఎమ్మెల్యే పెద్దికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పాలడుగుల రమేశ్, బీఆర్ఎస్కేవీ జిల్లా నాయకుడు కొల్లూరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.