పాలకుర్తి రూరల్, సెప్టెంబర్ 28 : రోడ్డు ప్రమాదంలో 13 లేగ దూడలు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి హైదరాబాద్‌లోని కబేలాల కోసం డీసీఎంలో 51 లేగ దూడలను తరలిస్తున్నారు. పాలకుర్తి మండలం వావిలాల మూల మలుపు వద్దకు రాగానే డీసీఎం డ్రైవర్ అతి వేగం, నిర్లక్ష్యం కారణంగా అదుపు తప్పి బోల్తాపడింది.
అందులో ఉన్న 13 లేగ దూడలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 13 గాయపడ్డాయి, పశు వైద్యాధికారి అశోక్‌రెడ్డి వాటికి వైద్య పరీక్షలు చేశారు. మిగిలిన 25 లేగ దూడలను పోలీస్ అధికారులు గోశాలకు తరలించారు. డీసీఎం డ్రైవర్ పరారయ్యాడని, జంతు నిరోధక చట్టం ప్రకారం అతడిపై కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య పరిశీలించారు.