పేర్ల మార్పుపై సర్వత్రా హర్షం
పటాకులు కాల్చి, స్వీట్లు పంచి సంబురం
ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయం
చారిత్రక ప్రదేశాలకు చక్కని గుర్తింపు
కలెక్టరేట్ వద్ద సంబురాల్లో మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన దయాకర్‌రావు
ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం
హన్మకొండ, ఆగస్టు 12 ;వరంగల్, హనుమకొండ ప్రాంతాలు ప్రత్యేక జిల్లాలుగా ఉండాలనే ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఆవిర్భావ సమయం నుంచీ ఈ డిమాండ్ ఉండగా ఎట్టకేలకు ప్రజాభీష్టం ప్రకారమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు గురువారం పేర్లు, స్వల్ప మార్పులతో జీవో జారీ చేయడంపై అటు నగరవాసులు, ఇటు టీఆర్ఎస్ శ్రేణుల్లో సంబురం అంబరాన్నంటింది. ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణమే ఒకరికొకరు స్వీట్లు పంచుకుని, పటాకులు కాల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
ప్రజాభిప్రాయం మేరకే..
ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి వారు ఇచ్చిన సూచనలతోనే రాష్ట్ర ప్రభుత్వం వరంగల్, హనుమకొండ జిల్లాల పేర్ల మార్చడమే గాక చారిత్రక ప్రాంతాలకు మంచి గుర్తింపు తీసుకొచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. సంబురాల్లో భాగంగా కలెక్టరేట్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు. ఆ తర్వాత స్వీట్లు పంపిణీ చేసి నాయకులతో కలిసి పటాకులు కాల్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర సర్కారు జీవో జారీ చేయడంతో ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ తీరిందన్నారు. ఇందుకుగాను వరంగల్, హనుమకొండ ప్రజలు, ప్రజాప్రతినిధుల తరపున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ మహానగర ప్రజల విజ్ఞప్తి మేరకు తనతోపాటు మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలమంతా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలపై జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ప్రజలు సూచనలను పరిగణలోకి తీసుకొని, ప్రజాభిప్రాయం మేరకు సీఎం జిల్లాల పేరు మార్పు నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. వరంగల్, హనుమకొండ చారిత్రక నేపథ్యాలు, కాకతీయుల కాలం నుంచి ఈ రెండు ప్రాంతాలకు ఉన్న ప్రాశస్త్యాన్ని పరిగణలోకి తీసుకొని సీఎం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పూర్వ వరంగల్ జిల్లా ప్రజలంతా ముక్తకంఠంతో అభినందిస్తున్నారని మంత్రి తెలిపారు. పరిపాలనా సౌలభ్యంతోపాటు కాకతీయల పాలనలో వరంగల్, హనుమకొండకు ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని భవిష్యత్ తరాలకు అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. ప్రజల విజ్ఞప్తి మేరకు పరకాల రెవెన్యూ డివిజన్లో శాయంపేట, ఆత్మకూరు మండలాలను, హన్మకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో కమాలాపుర్ మండలం కలిపామన్నారు. అలాగే ఆజంజాహిమిల్లు ఆవరణలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దాస్యం విజయ్‌భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భవిష్యత్‌లో వరంగల్‌లో అనూహ్య ప్రగతి..
పోచమ్మమైదాన్ : వరంగల్, హనుమకొండ జిల్లాల ఏర్పాటుతో ప్రజలంతా ఆనందోత్సాహాలతో ఉన్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఈ సందర్భంగా పోచమ్మమైదాన్‌లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే డప్పు చప్పుళ్లతో పాటు పటాకులు కాల్చి సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల తరహాలో వరంగల్, హనుమకొండ జిల్లాలు మరింత అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. అలాగే వరంగల్‌కు ఆనుకుని ఉన్న ఆజంజాహి మిల్లు, ఖిలా వరంగల్, మెగా టెక్స్టైల్స్ పార్క్‌తో తూర్పు నియోజకవర్గం ప్రగతిపథంలో దూసుకెళ్తుందని వివరించారు. ఇక్కడ జిల్లా హెడ్‌క్వార్టర్ ఏర్పాటుతో యువతకు ఉపాధితో పాటు అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. పదేళ్ల కాలంలో ఇతర జిల్లాలను తలదన్నేలా వరంగల్ ఊహించని రీతిలో మారుతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, నాయకులు మావురపు విజయభాస్కర్‌రెడ్డి, టీ రమేశ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.
కాకతీయుల ప్రాశస్త్యం తెలిపేలా జిల్లాలు మేయర్ గుండు సుధారాణి
వరంగల్ : కాకతీయుల ప్రాశస్త్యాన్ని తెలిపేలా సీఎం కేసీఆర్ వరంగల్, హనుమకొండ జిల్లాలుగా పేరు మార్చారని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. సంబురాల్లో భాగంగా గురువారం కార్పొరేషన్ ఆవరణలో ఆమె సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పాలనా సౌలభ్యం కోసం సీఎం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. జిల్లా ఏర్పాటుకు సహకరించిన మంత్రి కేటీఆర్, కృషి చేసిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కార్పొరేటర్లు స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు.
పేర్ల మార్పు హర్షణీయం
హన్మకొండ : వరంగల్, హనుమకొండ జిల్లాల మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయం. ఇటీవల వరంగల్ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు జిల్లాల పేర్లు, స్వరూపం మార్పును ప్రకటించింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలు అనగానే రెండు జిల్లాల ప్రజలు తరచూ గందరగోళానికి గురయ్యారు. పేర్ల మార్పుతో హనుమకొండ పేరు ప్రాచుర్యంలోకి వస్తుంది. అలాగే కాకతీయ కాలంలో మొదటి రాజధాని అయిన హన్మకొండకు పూర్వ వైభవం వస్తుంది. ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.