జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తూ వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగలా చేశారు. 24గంటల కరెంట్ సరఫరాతోపాటు పంట వేసుకునేందుకు రైతుబంధు పథకం కింద ఏటా రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దీంతో వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి లభించగా రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నారు. ఇక నుంచి రైతుబంధు నగదును రూ.16వేలకు పెంచనున్నట్లు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ రైతుబంధు పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నారని అన్నదాతలు సంబురపడుతున్నారు. మల్లా కేసీఆర్ సారే రావాలని అంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,19,784 మంది రైతులకు మరింత లబ్ధి చేకూరనున్నది.
మరింత ‘సాయం’
సమైక్య పాలనలో అరిగోస పడిన రైతులు స్వరాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తూ అండగా నిలిచారు. 24 గంటల కరెంట్, ఎరువులు, విత్తనాలు, సాగు నీరు అందిస్తుడడంతో అన్నదాతల కళ్లల్లో ఆనందం కనిపిస్తున్నది. 10 ఏళ్లలో రైతులు వ్యవసాయం చేస్తూ ఆర్థికంగా వృద్ధి చెందారు. గతంలో పంటలు వేసుకునే సమయంలో పెట్టుబడి డబ్బుల కోసం ఆసాములు, వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లి అప్పులు తెచ్చుకునేవారు. ఇది గమనించిన కేసీఆర్ పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏడాదికి రూ.10వేలు అందిస్తూ వస్తున్నారు. దీంతో రైతులు పెట్టుబడి డబ్బుల కోసం ఎవరి వద్దకూ వెళ్లకుండా సంతోషంగా పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు రైతుబంధు సాయాన్ని రూ.16వేలకు పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టడంతో అన్నదాతలు ఆందనందం వ్యక్తం చేస్తునారు.
జిల్లాలో 1,19,784 మందికి లబ్ధి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,19,784 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. అత్యధికంగా రేగొండ మండలంలో 18,725మంది రైతులు రైతుబంధును అందుకుంటున్నారు. భూపాలపల్లిలో 13,0 27 మంది, చిట్యాలలో 13,266, గణపురంలో 8,95 0, మొగుళ్లపల్లిలో 12,062, టేకుమట్లలో 10,598, కాటారంలో 11,528, మమదేవ్పూర్లో 7,220, మల్హర్లో 9,730, మహాముత్తారంలో 11,966, పలిమెల మండలంలో 2,412 మంది రైతులు రైతుబంధును పొందుతున్నారు. వీరందరికి ప్రభుత్వం ఏటా రూ.121.41కోట్లు చెల్లిస్తున్నది.
ఇకనుంచి రూ.16వేలు
రైతులకు పంట పెట్టుబడి సాయం ఇక నుంచి మరింత పెరగనున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాసీఎం కేసీఆర్ రైతులకు రైతుబంధు చెల్లిస్తూ వస్తున్నారు. ఎకరం భూమి ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి రూ.10వేలు రైతుల అకౌంట్లో వేస్తున్నారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా రైతుబంధు సాయాన్ని సైతం పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించి రూ.10వేల నుంచి రూ.16వేలకు పెంచనున్నట్లు ఇటీవల ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారు. అయితే రూ.16వేలు ఒకేసారి కాకుండా మొదటి ఏడాది రూ.12వేలకు చేస్తున్నామని, ఏడాదికి రూ.500 చొప్పున పెంచుకుంటూ వెళ్లి ఐదో సంవత్సరం వరకు రూ.16వేలు చేస్తామని తెలిపారు.
కేసీఆర్ సార్పై నమ్మకం ఉన్నది
సీఎం కేసీఆర్ సార్ మాకు పంట పెట్టుబడికి ఎకరానికి రూ. 10వేలు ఇత్తాండు. పైసలు మాత్రం ఎప్పుడూ ఆపలేదు. పంటలేసే టైంకు మా బ్యాంకుళ్ల పైసలు పడ్తనయ్. సార్ ఇచ్చే పైసలు మంచిగ ఆసర అయితనయ్. ఇప్పుడు వాటిని రూ.16వేలకు పెంచుతరట. సారు చెప్తంటే మాకు నమ్మకంగానే ఉంటది. ఎందుకంటే ఇప్పటిదాక పెట్టుబడి పైసలు టైంకు ఏసుకుంట అచ్చిండు. ఇప్పుడు కూడా ఏత్తడు. సారు సల్లగుండాలె. మల్లా సారే రావాలె..
-చింతల వీరయ్య, కైలాపూర్, చిట్యాల