ఉమ్మడి జిల్లాలో ఉత్సాహంగా వారోత్సవాలు
డప్పుకొట్టి.. జెండా పట్టి ర్యాలీలు
కదిలివస్తున్న రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు
పాలాభిషేకాలు, ఊరేగింపులతో సందడిగా పల్లెలు
చిట్యాలలో భారీ బైక్ ర్యాలీ పాలాభిషేకాలు, ఊరేగింపులతో సందడిగా పల్లెలు.. చల్లగరిగెలో భారీ బైక్ ర్యాలీ
వరంగల్, జనవరి 8 (నమస్తేతెలంగాణ);ఊరూరా ‘రైతుబంధు’ సంబురాలు జరుగుతున్న తీరు వేడుకల్ని తలపిస్తున్నది. పెట్టుబడి సాయం అందించి ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతాంగం ఒక్కో తీరుగా కృతజ్ఞత తెలుపుతున్నది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి వారోత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నది. సంబురాల్లో భాగంగా శనివారం ఆరో రోజైన శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎడ్లబండ్లు, బైక్‌లపై ర్యాలీలు నిర్వహించగా దారులన్నీ సందడిగా కనిపించాయి. పల్లెపల్లెనా ‘జై తెలంగాణ’, ‘జై కేసీఆర్’, ‘జై రైతుబంధు’ నినాదాలతో మార్మోగాయి. అనంతరం రైతుబాంధవుడు కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇక ఆడబిడ్డలు రైతుబంధు స్ఫూర్తితో ఉత్సాహంగా ముగ్గులేసి ఆకట్టుకున్నారు.
ఊరూరా రైతుబంధు వారోత్సవాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆరో రోజు శనివారం పాలాభిషేకాలు, ర్యాలీలు హోరెత్తాయి. సంబురాల్లో భాగంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అనంతారంలో నిర్వహించిన క్రికెట్ పోటీలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ హాజరై కొద్దిసేపు క్రికెట్ ఆడి యువతలో ఉత్సాహం నింపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెలో ఎడ్లబండ్లు, బైక్‌లపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో టీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ జ్యోతి పాల్గొన్నారు. జూకల్ వరకు ఉత్సాహంగా ర్యాలీ సాగగా, దారుల వెంట జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మార్మోగించారు. మల్హర్ మండలం తాడిచెర్లలో రైతులు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఎడ్లబండ్ల ర్యాలీ తీసి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపూడిలో ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్‌తో కలిసి ఎంపీ మాలోత్ కవిత రైతుబంధు సంబురాల్లో పాల్గొన్నారు. నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో మిరప రైతులు కళ్లంలో పోసిన మిరపకాయలను కేసీఆర్ ఫ్లెక్సీపై చల్లుతూ ఆనందం వెలిబుచ్చారు. హనుమకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లిలో ఎడ్లబండ్ల ర్యాలీలో అగ్రోస్ మాజీ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు పాల్గొన్నారు. రఘునాథపల్లిలో ముగ్గుల పోటీలకు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై విజేతలకు బహుమతులు అందించారు.