నాడు చెత్తాచెదారంతో అధ్వానంగా పరిసరాలు
నేడు పరిశుభ్రతకు కేరాఫ్‌గా నిలిచిన పల్లె
అభివృద్ధిలోనూ దూసుకుపోతున్న గ్రామం
ఆహ్లాదం పంచుతున్న ప్రకృతి వనం
‘పల్లె ప్రగతి’తో మారిన రూపురేఖలు
మహబూబాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : పల్లె ప్రగతితో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని పెనుగొండ గ్రామ ముఖచిత్రం మారింది. సమైక్య పాలనలో అభివృద్ధి చెందని ఈ పల్లె.. స్వరాష్ట్రంలో ప్రగతిపథంలో పరుగెడుతున్నది. గ్రామ 4500 జనాభా కాగా, ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.3 లక్షల 90వేలు విడుదల అవుతున్నాయి. వీటితో గ్రామ ప్రజల సౌకర్యార్థం డంపింగ్ యార్డు, చెత్తను వేరు చేసే కంపోస్టు షెడ్డు, నర్సరీ, చివరి మజిలీ సాఫీగా సాగిపోయేలా వైకుంఠధామాలు నిర్మించి అందుబాటులోకి రాగా, పల్లె ప్రకృతి వనం ఆహ్లాదం పంచుతోంది. అలాగే మెరుగైన పారిశుధ్య వ్యవస్థ, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం, గ్రామ పంచాయతీ భవనం, రైతు వేదిక భవనం, అంతర్గత రోడ్లు, సైడ్ కాల్వల వంటి నూతన నిర్మాణాలు చేపడుతుండడంతో గ్రామం రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇళ్ల నుంచి చెత్తాచెదారాన్ని తొలగించేందుకు ట్రాక్టర్ ఏర్పాటు చేసి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. జీపీ సిబ్బంది నిత్యం సైడ్డ్రెయిన్లను శుభ్రం చేస్తున్నారు. దీంతో ఒక్కప్పుడు గ్రామంలో ఎటుచూసినా చెత్తాచెదారం, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక అధ్వానంగా ఉన్న గ్రామ పరిసరాలు.. ఇప్పుడు కొత్తకళ సంతరించుకున్నాయి. పల్లె ప్రగతి పక్కాగా అమలవుతుండడంతో పరిశుభ్రతకు కేరాఫ్‌గా నిలుస్తోంది. మొక్కలను పెంచేందుకు గ్రామంలో నర్సరీని ఏర్పాటుచేసి ప్రజలకు ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. అలాగే పట్టణాలకు దీటుగా ప్రకృతి వనం, చిల్డ్రన్స్ పార్కు ఆహ్లాదం పంచుతున్నది. ప్రజలకు వైద్యం అందించేందుకు రూ.13 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నిర్మిస్తున్నారు. రైతులు సాగులో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించుకునేందుకు వీలుగా రూ.22 లక్షలతో రైతు వేదిక భవానాన్ని నిర్మించారు. నిరుపేదలకు ఆదుకునేందుకు 25 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తున్నారు. పాత గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడంతో రూ.16 లక్షలతో కొత్త భవనం నిర్మిస్తున్నారు. రూ.20 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, 3 లక్షలతో సైడ్ కాల్వలు నిర్మించారు.
చాలా మార్పు వచ్చింది
పల్లె ప్రగతి వల్ల గ్రామంలో చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందు ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం వేసేవారు. మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి ట్రాక్టర్ ద్వారా జీపీ సిబ్బంది చెత్తను తరలిస్తున్నారు. పల్లె ప్రకృతి వనంలో పిల్లల కోసం ఆట వస్తువులు ఏర్పాటుచేయడంతో సంబురంగా ఆడుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పల్లె ప్రగతి వల్ల గ్రామంలో సీజనల్ వ్యాధులు లేకుండా పోయాయి.