హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 11 : సీఎం కేసీఆర్ కృషితోనే రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి ఉత్సవాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు-ఉష దంపతులు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ప్రముఖ దాత వద్దిరాజు వెంకటేశ్వర్లు, గట్టు మహేశ్‌బాబు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం కాకతీయుల కాలం నాటి ఉత్తిష్ఠ గణపతిని అలంకరించి మూషిక వాహనంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ వాహన సేవ నిర్వహించారు. ఆధ్యాత్మికవేత్త వెనిశెట్టి సుబ్రహ్మణ్యం అందించిన మట్టి వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనలతో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుందన్నారు. వేయిస్తంభాల దేవాలయాన్ని ఆధ్యాత్మికంగా వెలుగొందే విధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అందరూ ఇంట్లోనే మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని కాపాడాలని, తెలంగాణ ప్రజలు సుఖఃసంతోషాలతో ఆనందంగా ఉండాలని మంత్రి కోరారు. మట్టి విగ్రహాలను పూజించాలని, ప్లాస్టిక్ వస్తువులను వాడొద్దని మంత్రి సూచించారు. కరోనా సందర్భంగా జాగ్రత్తలు తీసుకుని పూజలు చేయాలన్నారు. ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తే మానసిక ప్రశాంతత, మనోధైర్యం కలుగుతాయన్నారు. మతసామరస్యమే దేశానికి శ్రీరామరక్ష అని, 30 సంవత్సరాలుగా వేయిస్తంభాల ఆలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందనిఆయన పేర్కొన్నారు.
మట్టి విగ్రహాలను పూజించి ప్రకృతిని కాపాడుదాం
ప్రకృతిలో లభిస్తున్న ఔషధ గుణాలున్న పండ్లు, ఆకులతో భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. 9 రోజుల పాటు పూజలు చేసి జలాశయాల్లో నిమజ్జనం చేయాలని చెప్పారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయనాలతో కూడిన రంగుల వినాయకులను 9 రోజులు పూజించి కుంటలు, చెరువుల్లో నిమజ్జనం చేయడం వలన చేపలు, పశువులు మరణిస్తాయని తెలిపారు. అందుకే మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడుదామని సూచించారు. 21 రకాల పత్రులతో దేవుడిని అర్చించడం ప్రకృతి దేవతలని ఆరాధించడమేనని వివరించారు.
రెండో రోజు ఉత్తిష్ఠ గణపతిగా అలంకరణ..
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉత్తిష్ఠ గణపతిగా అలంకరించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ప్రముఖ బిల్డర్ వేముల సత్యమూర్తి సౌజన్యంతో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 9 రోజుల పాటు త్రికలపూజ, అన్నదానం నిర్వహించనున్నట్లు ఈవో పీ వేణుగోపాల్ తెలిపారు.