పరిశీలించిన వెంటనే మంజూరు
లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు నిర్ణయం
నేడు రాయపర్తి మండల కేంద్రంలో సదస్సు
రేపు సంగెం, గీసుగొండ మండలాల్లో..
బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు సన్నాహాలు
తొలి విడుత అమలుకు లబ్ధిదారుల ఎంపిక
వరంగల్, ఫిబ్రవరి 21(నమస్తేతెలంగాణ) : జిల్లాలో దళితబంధు పథకం అమలును వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో తొలి విడుత ప్రతి శాసనసభా నియోజకవర్గ పరిధిలో వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. జిల్లాలో ఐదు శాసనసభ నియోజకవర్గాల పరిధి ఉండగా, సోమవారం వరకు మూడింటి పరిధిలో లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఈ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందజేసిన జాబితాల్లోని లబ్ధిదారులకు ప్రభుత్వం యూనిట్లు మంజూరు చేసింది. లబ్ధిదారులకు నియోజకవర్గాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాయపర్తి, సంగెం, గీసుగొండ మండలాల్లోని వారికి 22, 23 తేదీల్లో సదస్సులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం ద్వారా తొలివిడుతలో మార్చి ఏడోతేదీలోగా ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో వంద మంది లబ్ధిదారులకు యూనిట్లు అందజేయాలని నిర్ణయించింది. ఒక్కో లబ్ధిదారుకు రూ.10 లక్షల యూనిట్‌ను పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక, అవగాహన సదస్సుల నిర్వహణ, బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, యూనిట్ల పంపిణీకి షెడ్యూల్ ఖరారు చేసింది. ఆయా నియోజకవర్గంలో దళితబంధు పథకం తొలివిడుత అమలుకు వంద మంది లబ్ధిదారులను గుర్తించి జాబితాను కలెక్టర్‌కు అందజేసే బాధ్యతను ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేకు అప్పగించింది. ఈ జాబితాలను పరిశీలించిన వెంటనే లబ్ధిదారులకు ప్రభుత్వం దళితబంధు పథకాన్ని మంజూరు చేస్తున్నది.
నేటి నుంచి అవగాహన..
దళితబంధు పథకం తొలివిడుత లబ్ధిదారుల ఎంపిక జరిగిన నియోజకవర్గాల్లో అవగాహన సదస్సులు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. పాలకుర్తి శాసనసభ నియోజకవర్గం పరిధిలోని రాయపర్తి మండలంలో ఇరవై మంది లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దళితబంధు పథకం తొలివిడుత అమలుకు రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో ఇరవై మందిని గుర్తించారు. ఈ మేరకు ఆయన అందజేసిన జాబితా ప్రకారం ఇరవై మందికి దళితబంధు పథకం మంజూరైంది. ఈ లబ్ధిదారులకు మంగళవారం రాయపర్తి మండల కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పరకాల శాసనసభ నియోజకవర్గం పరిధిలోని సంగెం మండల కేంద్రంలో 15, గీసుగొండ మండల కేంద్రంలో 15 మంది చొప్పున దళితబంధు పథకం లబ్ధిదారుల ఎంపిక జరిగింది.
ఇక్కడి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అందజేసిన జాబితాలో పేర్కొన్న ఈ రెండు మండలాల్లోని 30 మందికి ప్రభుత్వం దళితబంధు పథకం మంజూరు చేసింది. సంగెం, గీసుగొండ గ్రామాల్లోని ఈ 30 మంది లబ్ధిదారులకు సంగెం మండల కేంద్రంలో ఒకేచోట బుధవారం ఉదయం అవగాహన సదస్సు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. రాయపర్తి, సంగెం మండల కేంద్రాల్లో మంగళ, బుధవారం జరిగే దళితబంధు పథకం లబ్ధిదారుల అవగాహన సదస్సుల్లో కలెక్టర్ బీ గోపి, అదనపు కలెక్టర్ బీ హరిసింగ్‌తో పాటు ఎస్సీ కార్పొరేషన్, ప్రత్యేక అధికారులు, బ్యాంకర్లు పాల్గొననున్నారు. నర్సంపేట శాసనసభ నియోజకవర్గం పరిధిలోని నెక్కొండ, చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో తొలివిడుత వంద మంది లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఆరు మండలాల్లో వంద మందిని గుర్తించి స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అందజేసిన జాబితా ప్రకారం ప్రభుత్వం దళితబంధు పథకం మంజూరు చేసింది. లబ్ధిదారులకు కూడా అవగాహన సదస్సులు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
బ్యాంకు ఖాతాలకు ఏర్పాట్లు..
దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు రెండు మూడు దఫాలు అవగాహన సదస్సులను ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. మొదట నిర్వహించే సదస్సులో దళితబంధు పథకం, ప్రభుత్వం ఈ పథకం ద్వారా మంజూరు చేసిన రూ.10 లక్షలతో యూనిట్‌ను సెలెక్ట్ చేసుకోవడంపై సంబంధిత అధికారులు అవగాహన కల్పిస్తారు. రెండు, మూడో దఫా జరిగే సదస్సుల్లో సెలెక్ట్ చేసుకున్న యూనిట్లు, నిర్వహణ, ఇన్‌కం జనరేట్, లాభాలను తెలియజేస్తారు. ప్రధానంగా బెనిఫిట్స్ ఉండే యూనిట్లను లబ్ధిదారులు ఎంపిక చేసుకోవడమే లక్ష్యంగా అవగాహన సదస్సులు నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. మొదటి అవగాహన సదస్సు ఏర్పాటు చేశాక లబ్ధిదారుల పేర బ్యాంకులో దళితబంధు పథకం అమలు కోసం ప్రత్యేక ఖాతాలను తెరిపించే పనిలో తలమునకలయ్యారు. యూనిట్ల కోసం ప్రభుత్వం లబ్ధిదారులకు మంజూరు చేసిన మొత్తాన్ని ఈ ఖాతాల్లో జమచేయనున్నారు. ఈ క్రమంలో రాయపర్తి, సంగెం, గీసుగొండతో పాటు ఇతర మండలాల్లోని లబ్ధిదారుల పేర బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.