మహబూబాబాద్ రూరల్, జూలై 21 : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలో కనీస వసతులు లేక అవస్థలు పడుతున్నామని విద్యార్థులు ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని మూడుకొట్లు సెంటర్లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థుల ఆందోళనకు డీఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులు వినయ్, రాజేశ్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ కళాశాలలో సరిపడా తరగతి గదులు లేవన్నారు. ఇరుకుగా ఉన్న హాస్టల్ గదుల్లో ఉంచుతున్నారని, ఒక్కో రూమ్‌లో 15 నుంచి 20 మంది ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బాత్రూమ్లు కూడా సరిపడా లేవన్నారు.
పది రోజులుగా కళాశాలలో తాగునీరు లేక ఇబ్బందిపడుతున్నామని, బోర్ నడవడం లేదని, దీంతో స్నానం చేయకుండానే కళాశాలకు వెళ్తున్నామని వాపోయారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు పని చేయడం లేదని, ల్యాబ్, పర్నిచర్ లేదని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ఇంజినీరింగ్ కళాశాల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. నిరసనలో విద్యార్థి సంఘం నాయకులు సాయికుమార్, సూర్యప్రకాశ్, బోనగిరి మధు, జ్యోతిబసు, శ్రావణ్ పాల్గొన్నారు. కాగా, మూడుకొట్ల సెంటర్లో విద్యార్థులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ వారితో కలిసి నిరసనలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ కళాశాలలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులు తమ సమస్యలు తెలిపేందుకు రోడ్డెకాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో సౌకర్యాలు లేక విద్యార్థులు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందన్నారు. విద్యార్థులు చేసే న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందన్నారు. విద్యార్థులు ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
-మాజీ మంత్రి సత్యవతి రాథోడ్