ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ‘ఎన్బీకే 111’(వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాకినాడ పోర్ట్‌లో బాలకృష్ణ, మంచు మనోజ్‌లపై ఈ సినిమాకు చెందిన యాక్షన్ సీన్స్‌ని గోపీచంద్ తెరకెక్కిస్తున్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో బాలకృష్ణ కాలి కండరానికి బలమైన కోత పడింది. దాంతో అప్రమత్తమైన చిత్రబృందం షూటింగ్‌ని మధ్యలోనే నిలిపివేశారు. వైద్యుల ప్రాథమిక చికిత్స అనంతరం స్కానింగ్ కోసం కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రికి బాలయ్యను తరలించారు. గాయం చిన్నదేననీ, త్వరగా కోలుకునేందుకు మైనర్ సర్జరీ చేయాల్సివున్నదని, ప్రస్తుతానికైతే ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
ఈ ప్రమాదం గురించి దర్శకుడు మలినేని గోపీచంద్ ఎక్స్‌లో పేర్కొంటూ.. ‘సినిమాపై బాలకృష్ణగారి పాషన్, పాత్ర కోసం ఆయన కష్టపడే తత్వం మా టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తున్నది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఆయన త్వరలోనే కోలుకొని, షూటింగ్లో పాల్గొంటారు’ అని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలంటూ నటులు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు వేర్వేరుగా ‘ఎక్స్’లో పోస్టులు పెట్టారు. ‘బాలా బాబాయ్.. మీరు త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యంతో, అద్భుతమైన సామర్థ్యంతో తిరిగి మళ్లీ గర్జించాలి’ అంటూ ఎన్టీఆర్ పేర్కొనగా, ‘బాబాయ్.. మీరు త్వరగా కోలుకొని, మీరెంతో ప్రేమించే పని చేయడానికి తక్కువ సమయంలోనే మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి రావాలి’ అంటూ కల్యాణ్‌రామ్ కోరారు.