వరంగల్, డిసెంబర్ 16(నమస్తేతెలంగాణ) : వరంగల్ ప్రజల చిరకాల కోరిక తీరింది. తూర్పు పట్టణం అభివృద్ధి బాట పట్టింది. సీఎం కేసీఆర్ చారిత్రక నగరిపై ప్రేమ చాటుతున్నారు. ఆయన ప్రకటించినట్లు వరంగల్‌లోని ఆజంజాహి మిల్లు స్థలంలో సమీకృత కలెక్టరేట్ నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఇక్క డ నర్సంపేట రోడ్డులో ఉన్న చేనేత, జౌళి శాఖ స్థలంలోని 6.16 ఎకరాలు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నేతృత్వంలో టీఆర్ఎస్ శ్రేణులు సమీకృత కలెక్టరేట్ స్థలంలో సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచారు. డప్పు చప్పుళ్లతో నృత్యం చేశారు. వీరితో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని స్టెప్పులేశారు. టీఆర్ఎస్ శ్రేణుల నినాదాలతో ఆజంజాహి మిల్ గ్రౌండ్ మార్మోగింది. హనుమకొండ సుబేదారిలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను జూన్ 21న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పినవి దశలవారీగా అమల్లోకి వస్తున్నాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల స్థానంలో హనుమకొండ, వరంగల్ జిల్లాలు ఏర్పడ్డాయి. తాజాగా వరంగల్‌లోని ఆజంజాహి మిల్ గ్రౌండ్ స్థలంలో సమీకృత కలెక్టరేట్ నిర్మాణం కోసం భూమి కేటాయించారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లు జిల్లా ప్రజలందరికీ అనువుగా ఉండేలా కలెక్టరేట్ నిర్మాణానికి స్థలం కేటాయించడం విశేషం. వరంగల్ మండలం లక్ష్మీపురం, ఖిలావరంగల్ పరిధిలోని 68, 69, 70, 71, 369, 378, 379 సర్వే నంబర్లలోని 6.16 ఎకరాలను కేటాయించినట్లు ప్రభుత్వ కార్యదర్శి శైలజ రామయ్యర్ ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఇక్కడ కలెక్టరేట్ నిర్మిస్తే నర్సంపేట, వర్ధన్నపేట ప్రాంతాల ప్రజలకూ సౌకర్యంగా ఉంటుందనే ప్రతిపాదన మొదటి నుంచీ ఉంది.
అంబరాన్నంటిన సంబురాలు..
సమీకృత కలెక్టరేట్ నిర్మాణం కోసం స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడడంపై జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తర్వుల సమాచారం అందగానే సంబురాలకు ఎమ్మెల్యే నన్నపునేని పిలుపునిచ్చారు. ఉదయం పదకొండు గంటల వరకు తూర్పు నుంచి వ్యాపారులు, ఉద్యోగులు, ప్రజలు ఆజంజాహి మిల్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. అప్పటికే సమీకృత కలెక్టరేట్ నిర్మించే స్థలంలో పిచ్చి మొక్కల తొలగింపు ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో ఇక్కడకు తరలివచ్చిన జనం ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. గజమాల, శాలువాలతో సత్కరించారు.
అనుకున్న చోటే కలెక్టరేట్..
అడ్డంకులెదురైనప్పటికీ అనుకున్న చోటే వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆజంజాహి మిల్ గ్రౌండ్ స్థలంలో కలెక్టరేట్ నిర్మాణంపై ఇటీవల కొన్ని ఆటంకాలు తలెత్తాయి. కొందరు ఈ స్థలంలో తమకు ఇండ్ల స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వీటన్నింటినీ అధిగమించి ఇక్కడ కలెక్టరేట్‌కు స్థలం కేటాయించింది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టి పడేలా ఆయన గతంలో ఈ స్థలంలో సభలు నిర్వహించారు. ఇదే స్థలంలో ఇండ్ల స్థలాలు కేటాయించాలనే వారికి కూడా ప్రభుత్వం న్యాయం చేయనుందని, ఈ మేరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారని ఎమ్మెల్యే చెప్పారు. తాను కూడా సహకరిస్తానన్నారు. ఇక్కడ సమీకృత కలెక్టరేట్ నిర్మాణంతో లేబర్కాలని, క్రిస్టియన్‌కాలనీ, చింతల్‌తో పాటు పలు కాలనీలకు వెలుగు రానుంది. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి, మాజీ చైర్మన్ టీ రమేశ్‌బాబు, కార్పొరేటర్ గుండేటి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.