వర్ధన్నపేటలో అరూరి, నర్సంపేటలో పెద్ది, పరకాలలో చల్లా, వరంగల్ తూర్పులో మేయర్ సుధారాణి ఆధ్వర్యంలో సంబురాలు సువిశాల భారతావనిలో తెలంగాణ భాగస్వామ్యమై 75వ ఏట అడుగిడిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు’ తొలిరోజు అంబరాన్నంటాయి. వేలాది మంది జాతీయ జెండాలు చేతబూని తీసిన ర్యాలీలతో నియోజకవర్గకేంద్రాలు హోరెత్తగా.. ‘సమైక్యతా’భావం వెల్లివిరిసింది. వర్ధన్నపేట, పాలకుర్తిలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో భారీ ర్యాలీ కొనసాగింది. వర్ధన్నపేటలో ఎమ్మెల్యే అరూరి రమేశ్, నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, వరంగల్ తూర్పులో మేయర్ గుండు సుధారాణి, పరకాలలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఆధ్వర్యంలో నిర్వహించిన సమైక్యతా ర్యాలీలు, సభల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
– వరంగల్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ)
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు తొలిరోజు అంబరాన్నంటాయి. వేడుకల్లో భాగంగా శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో మువ్వన్నెల జెండాలతో భారీ ర్యాలీలు నిర్వహించగా సబ్బండ వర్గాలు సమైక్యతా స్ఫూర్తిని చాటుతూ ఉత్సాహంగా పాల్గొన్నాయి. నెత్తిన బతుకమ్మలు, బోనాలతో మహిళలు తోడు రాగా, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దారుల వెంట విద్యార్థులు, యువకుల ఆటాపాటలు హోరెత్తాయి.
హనుమకొండలో వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. మువ్వన్నెల జెండాలతో భారీ ర్యాలీ తీయగా చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య పాల్గొన్నారు. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో చీఫ్‌విప్ దాస్యం పాల్గొన్నారు. పరకాలలో త్రివర్ణ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొన్నారు.
వరంగల్‌లోని వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ర్యాలీ, సభలు ఘనంగా జరిగాయి. వర్ధన్నపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ పాల్గొన్నారు. నర్సంపేటలో 15వేల మందితో భారీ ర్యాలీ తీసి బహిరంగ సభ నిర్వహించారు. ఇక్కడ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, జడ్పీలో టీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న పాల్గొన్నారు. పోచమ్మమైదాన్ నుంచి సీకేఎం కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ, సభ కొనసాగింది. కార్యక్రమాల్లో నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ బీ గోపి, కుడా చైర్మన్ సుందర్రాజ్ పాల్గొన్నారు.
భూపాలపల్లిలోని అంబేద్కర్ క్రీడా మైదానంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, వరంగల్ ఎంపీ పసూనూరి దయాకర్, కలెక్టర్ భవేశ్‌మిశ్రా, ఎస్పీ సురేందర్‌రెడ్డి హాజరయ్యారు. 300 మీటర్ల త్రివర్ణ పతాకంతో 15వేల మందితో భారీ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ములుగులో మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, రాష్ట్ర రెడ్కో చై ర్మన్ ఏరువ సతీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. జాతీయ జెండాలతో 10వేల మంది భారీ ర్యాలీ తీయగా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ పాల్గొన్నారు.
జనగామ జిల్లాలో జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో వేలాది మంది జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలు నిర్వహించి సమైక్యతా స్ఫూర్తిని చాటారు. పాలకుర్తిలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, టీఎస్ ఆర్డీసీ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీచైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ శివలింగయ్య హాజరయ్యారు.