భూపాలపల్లి టౌన్, ఆగస్టు 9 : కాలానుగుణంగా వ్యవసాయరంగంలో అధునాతన మార్పులు వస్తున్నాయి. సాగు పనుల్లో సాంకేతిక పెరిగిపోతున్నది. ఎద్దులతో ఎవుసం చేసే రోజులు పోయి, కొత్తకొత్త యంత్రాలు రైతు ముంగిట్లోకి వస్తున్నాయి. ప్రతి పనికి ఒక యంత్రం రావడంతో తక్కువ పెట్టుబడితో సాగు పనులు పూర్తవుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చాలామంది రైతులు ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు.
బూమ్ స్ప్రేయర్
స్వాల్, యూపీఎల్ కంపెనీలు సంయుక్తంగా బూమ్ స్ప్రేయర్ యంత్రాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చాయి. రూ.8లక్షల విలువైన ఈ యంత్రాన్ని కంపెనీవారు సామాజిక బాధ్యతగా తక్కువ ధరకు అద్దెకు ఇస్తున్నారు. అన్ని మెట్ట పంటల్లో ఈ యంత్రం ద్వారా పురుగు మందులు పిచికారీ చేసుకోవచ్చని, మొక్కకు ఎలాంటి నష్టం వాటిల్లదని, మిర్చి , పత్తి పంటలకు ఇది అనువుగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ యంత్రం 600 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎకరాకు రూ.160 మాత్రమే తీసుకుని స్ప్రే చేస్తున్నారు. nurture.form యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని యంత్రాన్ని బుక్ చేసుకోవాలి. రెండు రోజుల ముందు బుక్ చేసుకుంటే ఎకరానికి రూ.100, అత్యవసరంగా బుక్ చేసుకుంటే రూ.160 చార్జ్ చేస్తారు. కంపెనీ వారు మరో ఆఫర్ కూడా ఇచ్చారు. యంత్రాన్ని యాప్ ద్వారా బుక్ చేసుకుని కంపెనీ వారి పురుగు మందుల ప్రోడక్ట్ కొనుగోలు చేస్తే ఒక కార్డు ఇస్తారు. దాన్ని స్క్రాచ్ చేయగా వచ్చే పాయింట్స్ ఆధారంగా చెల్లింపు చేస్తే చార్జీలు తగ్గుతాయి.
డ్రోన్స్
డ్రోన్లు వ్యవసాయ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. అన్ని పైరులపై పురుగు మందులను పిచికారీ చేయడానికి ఇప్పుడు డ్రోన్స్ వాడుతున్నారు. స్ప్రెమ్మ కంపెనీ డ్రోన్లను పురుగుమందుల పిచికారీకి అద్దెకు ఇస్తున్నది. ఒక ఏరియాకు బల్క్‌గా బుక్ చేసుకుంటే ఎకరానికి రూ.450 చార్జి చేస్తారు. రూ.5.50 లక్షల విలువ చేసే ఈ డ్రోన్‌లో 10 లీటర్ల కెపాసిటీ గల ట్యాంకు ఉంటుంది. సెన్సార్ డైరెక్షన్లో డ్రోన్ పనిచేస్తుంది.
పవర్ వీడర్
పవర్ వీడర్.. ఇది కలుపు తీసే యంత్రం. దీన్ని మల్టీపర్పస్‌గా వాడుకోవచ్చు. 5,6,7 హెచ్‌పీ సామర్థ్యంతో ఇవి లభిస్తాయి. కెపాసిటీని బట్టి రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు ధర ఉంటుంది. పది మంది కూలీలు చేసే పనిని ఈ యంత్రం చేస్తుంది. నడిపే మనిషికి ఓపిక ఉంటే రోజుకు 4 ఎకరాల్లో కలుపుతీయొచ్చు. లీటర్ డీజిల్‌తో రెండు ఎకరాల్లో కలుపుతీయవచ్చని అధికారులు చెబుతున్నారు.
రైతులు స్వాగతిస్తున్నారు
వ్యవసాయంలో నూతన టెక్నాలజీని రైతులు స్వాగతిస్తున్నారు. ఖర్చు, పని సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. నూతన టెక్నాలజీ పై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. కాటారం మండలంలో బూమ్ స్ప్రేయర్లను కంపెనీ అద్దెకు ఇవ్వగా అద్భుతంగా పనిచేస్తున్నాయి. మరో రెండింటిని కంపెనీ వారు తీసుకొస్తున్నారు. అలాగే డ్రోన్లతో పురుగుల మందు స్ప్రే చేసే విషయమై ఇటీవల కంపెనీ వారు డెమో ఇచ్చారు. త్వరలో అవి కూడా అందుబాటులోకి రానున్నాయి. రేగొండ మండలం పోచంపల్లిలో కలుపుతీసే యంత్రం ‘పవర్ వీడర్’ రైతులు వాడుతున్నారు. సబ్సిడీ లేకున్నా రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు (కెపాసిటీ ని బట్టి) వెచ్చించి గ్రామంలో వందమంది రైతులు కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు. – విజయభాస్కర్, జయశంకర్ భూపాపల్లి జిల్లా వ్యవసాయ అధికారి