వరంగల్, సెప్టెంబర్ 7: గ్రేటర్ వరంగల్‌లో ముంపు నివారణకు సమగ్ర ప్రణాళికలు చేస్తున్నామని మేయర్ గుండు సుధారాణి అన్నారు. ముందస్తు చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పారు. గ్రేటర్ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో బల్దియా కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ఆమె మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తుగానే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నగరంలోని ప్రధాన చెరువుల నుంచి వచ్చే వరద నీటిని మళ్లీంచేందుకు ఇరిగేషన్ అధికారుల సహకారంతో కన్సల్టెన్సీ ద్వారా ప్రణాళికలు చేస్తున్నామని వెల్లడించారు. గత ఏడాది వరద సమయంతో మంత్రి కేటీఆర్ నగరంలో పర్యటించి ఇచ్చిన సూచనల మేరకు పలు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. రూ. 77 కోట్లతో కొత్త ప్రాతిపాదనలు చేశామన్నారు.
నగరం జలమయం..
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలలోకి వరద పోటెత్తింది. సోమవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ కుండపోతగా కురిసిన వానతో నగర రహదారులు చెరువులను తలపించాయి. మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య ముంపు పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్టీఆర్నగర్, బృందావన్కాలనీలు పూర్తిగా వరద నీటిలో మునగడంతో మేయర్, కమిషనర్ బోటులో వెళ్లి పరిస్థితిని చూశారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను బోటులో బయటకు తీసుకొచ్చి పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ భోజన వసతి, ఆహార పొట్లాలు అందజేస్తున్నారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. వరంగల్‌లోని శివనగర్, మైసయ్యనగర్, బీఆర్‌నగర్, సీఆర్‌నగర్, ఎన్టీఆర్నగర్, బృందావన్‌కాలనీ, సాయినగర్, సంతోషీమాతా కాలనీ, రామన్నపేట, పోతననగర్, లక్ష్మీగణపతి కాలనీ, మధురానగర్, హనుమకొండలోని రంగంపేట, భద్రకాళిరోడ్, సరస్వతి నగర్ కాలనీ, కాకాజీకాలనీ, కాపువాడ, దీనదయాల్నగర్, గోపాల్పూర్, కాకతీయ కాలనీ, సమ్మయ్యనగర్, అమరావతినగర్, ఇందిరానగర్, టీవీటవర్కాలనీ, బంధం చెరువు ప్రాంతం, కాజీపేటలోని బాపూజీనగర్, విష్ణుపురి కాలనీలో పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. హంటర్‌రోడ్, పోతన బైపాస్ రోడ్‌పై వరద నీరు ప్రహహిస్తుండడంతో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. ములుగురోడ్, భద్రకాళి ఆలయం రహదారి, ములుగురోడ్ జంక్షన్, అలంకార్ పెద్దమోరీ, హనుమకొండ బస్‌స్టేషన్ రహదారి, నయీంనగర్ కల్వర్టు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీటి ప్రవాహనంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాకపోకలు స్తంభించాయి. ముంపు ప్రాంతాల్లో బల్దియా డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. సుమారు 150 మందిని డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న 18 వందల మందికి భోజనం అందించినట్లు అధికారులు తెలిపారు. సంతోషిమాతా గార్డెన్, కీర్తిగార్డెన్స్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మేయర్, కమిషనర్ సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పారు. 42 లోతట్టు ప్రాంతాలను గుర్తించి డివిజన్ల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు బల్దియా కమిషనర్ తెలిపారు.
వరుణుడి ప్రతాపం
ఖిలావరంగల్/మట్టెవాడ/వరంగల్ చౌరస్తా/కరీమాబాద్: చారిత్రక నగరంపై వరుణుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి నగర రోడ్లన్నీ నదులను తలపింపజేశాయి. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేశ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వాహనాలను క్రమబద్ధీకరించారు. శివనగర్‌లోని మైసయ్యనగర్ను డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ సందర్శించారు. 34, 38వ డివిజన్లలోని ముంపు ప్రాంతాలను కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, బోగి సువర్ణాసురేశ్ సందర్శించారు. వరంగల్ పోతనరోడ్, మండిబజార్, చార్‌బౌళి, ఎల్లమ్మబజార్, రామన్నపేటలో వరద నీరు ఇండ్లలోకి చేరగా, బల్దియా అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వరంగల్ హంటర్‌రోడ్‌లో బొందివాగు పొంగిపొర్లడంతో కాలనీలు నీటమునిగాయి. ముంపుకు గురైన కాలనీ ప్రజలకు బోటు ద్వారా సంతోషిమాతా గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. కరీమాబాద్ ప్రాంతంలోని ముంపునకు గురైన కాలనీలను మేయర్, కమిషనర్‌తో కలిసి కార్పొరేటర్లు పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, సిద్ధం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, గుండు చందన, ఈదురు అరుణ సందర్శించారు.