ఏటూరునాగారం, ఆగస్టు 6 : పంటకు నారు దశ అనేది ఎంతో కీలకం. మొక్క ఎదిగే వరకు పసిపిల్లలా కాపాడుకోవాల్సి ఉంటుంది. కానీ భారీ వర్షం కురిసినప్పుడు కొట్టుకుపోయో, తీవ్రమైన ఎండలతో ఎండిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఎక్కువగా సాగయ్యే మిర్చి పంటపై ఇది తీవ్రంగా ఉండేది. అయితే ప్రకృతి విపత్తుల నుంచి నారును కాపాడుకునేందుకు ఈసారి కొత్తదారి ఎంచుకున్నారు. తక్కువ ఖర్చు, నష్టానికి తావులేకుండా ‘షేడ్ నెట్ నర్సరీ’ ఏటూరునాగారంలో అందుబాటులోకి రావడం అక్కడి రైతుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఎండావానలతో సంబంధం లేకుండా 200 ఎకరాల దాకా నారు వేసే అవకాశం ఉండడంతో అందరూ ఆసక్తి చూపుతున్నారు.
మిరప నారు పెంచేందుకు గోదావరి తీర ప్రాంత రైతులు షేడ్ నెట్ నర్సరీల బాట పడుతున్నారు. ఏటూరునాగారం గోదావరి పరీవాహక ప్రాంతంలో రైతులు ఎక్కువగా మిర్చి సాగు చేస్తారు. మొన్నటివరకు ఇంటి ఆవరణలో పెరట్లో నారుమడులు పోసుకునేవారు. నారు దిబ్బలు చేసుకుని వాటిలో గింజలు నాటి చుట్టూ కంచె కట్టేవారు. ఇక భారీ వర్షాలకు గింజలు కొట్టుకుపోవడం, మొక్కలైతే మురిగిపోవడం, ఎండకు ఎండిపోవడంతో మొక్కేత సమయంలో నారు సరిపోకుంటే ఇతర ప్రాంతాల్లో మిర్చి మొక్కల కోసం తిరిగేవారు. వర్షాలకు నారుమడులు కొట్టుకుపోయేవి. రైతుల ఆశలు నీరుగారిపోయేవి. అధిక పెట్టుబడితో కూడుకున్న ఈ పంట సాగులో ప్రకృతి విపత్తులతో నష్టం వాటిల్లకుండా కొత్త విధానం ఎంచుకున్నారు. ఇక వీటన్నింటిని అరికట్టే షేడ్ నెట్స్ నర్సరీల్లో మిర్చి నారు పెంచే ప్రక్రియను రైతులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఏటూరునాగారం-రామన్నగూడెం మధ్యలోని రెండు ఎకరాల్లో ఈసారి షేడ్ నెట్స్ కింద మిర్చి నారు పెంపకానికి శ్రీకారం చుట్టారు. రూ.40లక్షల వ్యయంతో అవసరమైన పరికరాలను సమకూర్చుకున్నారు. ఇక్కడ రెండు వందల ఎకరాలకు సరిపోయే నారుమడిని తొలిసారి ఏర్పాటుచేస్తున్నారు. పైన నల్లటి నెట్, చుట్టూ తెల్లటి నెట్‌ను ఏర్పాటుచేశారు. ఇక ట్రేల్లో మిర్చి గింజలు వేసి నారుమళ్లు పెంచుతున్నారు.
తక్కువ ఖర్చుతో రైతులు ఆసక్తి
షేడ్ నెట్లో మిర్చి నారు వేసేందుకు ఖర్చు తక్కువ, నష్ట నివారణ తగ్గించుకునే అవకాశముంది. దీంతో ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఒక ఎకరానికి సుమారుగా 15వేల మొక్కల వరకు అవసరం ఉంటాయి. అయితే రైతులు సొంతంగా మిర్చి నారు మడి చేస్తే ఎకరానికి రెండింతలు అయ్యే ఖర్చు షేడ్ నెట్ పెంపకంలో సగం వరకే వస్తుంది. ముందుగా ట్రేలల్లో ఉండే గుంతల్లో కోకో పిట్ నింపుతారు. అందులో మిర్చి గింజ వేస్తారు. ఆ తర్వాత ట్రేలన్నింటినీ ఒక దిబ్బలా చేర్చి గాలిపోకుండా టార్పాలిన్ షీట్ వేస్తారు. ఆరు రోజుల తర్వాత మొలకలు వస్తాయి. దిబ్బల నుంచి ట్రేలను వేరు చేసి మడిలోకి మార్చుతారు. ఇ క్కడ వీటిని 45రోజుల పాటు పెంచుతారు. అయితే ఈ 45 రోజుల్లో షేడ్ నెట్ ద్వారా ఎండ, వర్షం అవసరమైన మేరకు మాత్రమే నారుకు లభిస్తుంది. దీంతో మొక్కలు చనిపోవడం జరుగదు. కోకోపిట్ వేయడం వల్ల మొక్కలు బలంగా ఉంటాయి. నారు పెరుగుతున్న కొద్దీ అవసరమైన మందులను కూడా నారుకు అందజేస్తారు. డ్రిప్ ద్వారా నీటిని అందిస్తారు. 45 రోజులకు నారును నేరుగా సాగుభూమిలో నాటుతారు. ఓపెన్ నారుమడిలో మిర్చి నారు సాగుచేస్తే అవి పీకే టప్పుడు 20శాతం మొక్కల్లో వేర్లు తెగిపోయి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కోళ్లు కూడా నారుమడులను చెడగొట్టే అవకాశం ఉంది. షేడ్ నెట్స్ కింద పెంచే మొక్కల్లో నష్టం రెండు శాతం కూడా ఉండదని రైతులు చెబుతున్నారు. ట్రేల చుట్టూ నెట్ ఉండడం వల్ల లోపలికి పక్షులు, కోళ్లు వచ్చే అవకాశాలు లేవు.
తొలిసారి ప్రయోగం చేశాం..
తొలిసారి షేడ్ నెట్ నర్సరీని ఏర్పాటు చేశాను. రైతులకు ఈ తరహా సాగు అలవాటు చేస్తే ఖర్చు తగ్గుతుంది. రైతులు తమకు అవసరమైన మిర్చి విత్తనాలను ఇస్తే 45 రోజుల తర్వాత మొక్కలు ఇచ్చేలా ఏర్పాటు చేశాం. ఒక మొక్కకు 60 పైసలు తీసుకుంటున్నం. 200 ఎకరాలకు సరిపోయే నారును ఇక్కడ పెంచే ప్రయత్నం చేశాం. ఇలా పెంచడం వల్ల క్వాలిటీ నారు వస్తుంది. మొక్కేత సమయంలో నారు సరిపోతుందా లేదా అనే సందేహం కూడా అవసరం లేదు. ఈ నర్సరీకి అవసరమైనంత(40శాతం వరకు) ఎండ, వర్షం మాత్రమే లోపలికి వచ్చేలా నెట్స్‌ను సరిచేశాం. ఈ సాగులో మొక్కలు దెబ్బతినవు. భారీ వర్షాలు పడినా ఇబ్బంది లేదు. ఇక్కడ సుమారు 20 నుంచి 40 మందికి ఉపాధి దొరుకుతోంది. – రామారావు, నర్సరీ నిర్వాహకుడు
రైతులకు ఎంతో మేలు..
సొంతంగా వేసుకునే నారుమడికి వర్షం పడితే నష్టమే. నీళ్లు నిలిస్తే నారు కుళ్లిపోతుంది. నారు పీకేటప్పుడు వేర్లు తెగిపోవడం వల్ల నాటుకోకుండా మొక్క చనిపోతుంది. నర్సరీలో నారు పెంచడం వల్ల రైతుకు నష్టం తగ్గుతుంది. రెండెకరాలకు సరిపోయే మిర్చి గింజలను నర్సరీలో ఇచ్చాను. గతేడాది నారుదిబ్బ వర్షానికి దెబ్బతిన్నది. అందుకే మిర్చి నారు మార్కెట్లో కొనుక్కున్నా. నర్సరీ మొక్క నాటేసుకునే ముందు తీస్తే ట్రే నుంచి కోకోపిట్‌తో సహా వస్తుంది. పిట్‌కు వేర్లు ఉంటాయి. దీంతో వేసిన ప్రతి మొక్కా నాటుకుంటుంది. పెరట్లో మడులు వేసుకోవడం వల్ల రోజూ కాపాడుకోవాలి. నర్సరీలో ఆ సమస్య లేదు. మొక్కలు చావవు. నర్సరీ పెట్టడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం.