హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 24 : మెకానిక్ పనితో వచ్చే ఆదాయం సరిపోక బైకులను దొంగిలించడం మొదలుపెట్టాడు బియాబానీ. సుమారు 26 బైకులను దొంగిలించి తాను నివసిస్తున్న గ్రామ పరిసర ప్రాంతాల్లో అమ్మేవాడు. డీసీపీ పుష్ప, ఏసీపీ జితేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందు మల్లారెడ్డిపల్లికి చెందిన ఎండీ బియాబానీ అలియాస్ బియాబాయ్ మెకానిక్‌గా పనిచేసేవాడు. ఆదాయం సరిపోకపోవడంతో హనుమకొండ పరిసర ప్రాంతాల్లో దొంగ తాళాలతో పార్కింగ్ చేసిన బైకులను దొంగిలించడం మొదలుపెట్టాడు. తాను నివస్తున్న ఇల్లంద గ్రామ పరిసర ప్రాంతాల్లో బైక్‌లను అమ్మి డబ్బులు సంపాదించేవాడని తెలిపారు. ఈ క్రమంలో హనుమకొండ ఎస్సై సీహెచ్ రఘుపతి తన సిబ్బందితో కలిసి మంగళవారం ఉదయం అలంకార్ జంక్షన్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బియాబానీ అనుమానాస్పదంగా బజాజ్ బాక్సర్ మోటర్ సైకిల్‌పై వెళ్తున్నాడు. పట్టుకుని విచారించగా చేసిన తప్పు ఒప్పుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు సుమారు రూ.6,88,500 విలువైన 26 వివిధ రకాల మోటర్ సైకిళ్లను దొంగిలించాడు. బైకులతో పాటు రూ.14 వేల విలువైన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.7,02,500 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు వాహనాలు పార్కింగ్ చేసినప్పుడు సరిగా లాక్‌వేసి వెళ్లాలని, వీలైతే సీసీ కెమెరాలు ఉన్న ప్రదేశాల్లో పార్కింగ్ చేయాలని, ప్రజలు వాహనాలు పార్కింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని వారు సూచించారు. అనంతరం దొంగను పట్టుకోవడంలో సహకరించిన సీఐ వీ వేణుమాధవ్, ఎస్సైలు జీ రాజ్‌కుమార్, సీహెచ్ రఘుపతి, కానిస్టేబుళ్లు బీ భావ్‌సింగ్, జీ శివకృష్ణ, ఎండీ గౌస్‌పాషా, వీరేందర్, పీ నగేశ్, ఎండీ యాకూబ్‌పాషా, డీ రవి, టెక్నికల్ టీం సభ్యులు ఎండీ సల్మాన్‌పాషా, డీ శ్రీకాంత్‌ను వారు అభినందించారు.