రాయపర్తి, మార్చి 12: నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు రాష్ట్రంలోని మహిళా లోకానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం మండలకేంద్రంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మండల నాయకురాలు కాంచనపల్లి వనజారాణి, పార్టీ శ్రేణులు, మహిళా నేతలు రాస్తారోకో, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వనజారాణి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, బతుకమ్మ వేడుకలను విశ్వవ్యాప్తం చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న తెలంగాణ ఉద్యమకారిణి కల్వకుంట్ల కవితను అవమానించిన బండి సంజయ్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతోపాటు జరిగిన తప్పిదానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్‌లో ఆయనను తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు. అనంతరం ‘బండి’ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రంగు కుమార్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్ల సుధీర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, పూస మధు, గారె నర్సయ్య, అయిత రాంచందర్, నలమాస సారయ్య, కుక్కల భాస్కర్, భూక్యా భద్రూనాయక్, మచ్చ సత్యం, బందెల బాలరాజు, ఉబ్బని సింహాద్రి, రామారావు, కాశీనాథం, సరికొండ విశ్వాస్‌రెడ్డి, నవల, వేణు పాల్గొన్నారు.
ఖిలావరంగల్: నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అసభ్య పదజాలంతో దూషించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తూర్పు నియోజకవర్గంలోని మహిళా కార్పొరేటర్లు మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళా దినోత్సవం రోజునే ఓ మహిళా ప్రతినిధిపై ఆయన ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమ, పోశాల పద్మ, ముష్కమల్ల అరుణ, పల్లం పద్మ, గందె కల్పన ఉన్నారు.
పర్వతగిరి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేసు నమోదు చేయాలని జడ్పీటీసీ బానోత్ సింగ్‌లాల్ డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూ మహిళలను గౌరవించని బండి సంజయ్ తీరు విచారకరమన్నారు. బాధ్యత కలిగిన ఎంపీ హోదాలో ఉన్న ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత, ఎమ్మెల్సీ అయిన కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్‌కుమార్‌గౌడ్, ఏకాంతంగౌడ్ ఉన్నారు.
చెన్నారావుపేట: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ మండల కన్వీనర్, వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే నిరసనలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట సర్పంచ్ కుండె మల్లయ్య, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, యువ నాయకుడు కంది కృష్ణచైతన్య పాల్గొన్నారు.
దుగ్గొండి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాగృతిని స్థాపించి తెలంగాణ ఆచార వ్యవహారాలను విశ్వవ్యాప్తం చేసిన కల్వకుంట్ల కవితపై ఆయన మాట్లాడిన తీరు క్షమించరానిదన్నారు. రేపటికల్లా బండి సంజయ్ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా మండలకేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.