ములగుటౌన్, మే29 : వచ్చే నెల 3 నుంచి 18వ తేదీ వరకు జరిగే 5వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని గ్రామ పంచాయతీలు సూచనలు పాటించాలని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నాలుగు విడుతల్లో జరిగిన పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించుకొని 5వ విడుతలో చేపట్టాల్సిన కార్యచరణ ప్రణాళికను రూపొందించేందుకు సూచనలు జారీ చేశారు.
పల్లె ప్రగతి పనుల్లో భాగంగా గ్రామాల్లో నిర్మించిన వైకుంఠథామాలు, డంపింగ్ యార్డులను ముందస్తుగానే పరిశీలించి లోపాలను గుర్తించాలన్నారు. వాటిని సవరించి పూర్తి స్థాయిలో వినియోగానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో మరుగుదొడ్లు వినియోగించని కుటుంబాలను గుర్తించి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ప్రతి మండలానికి జిల్లా స్థాయి అధికారిని మండల ప్రత్యేక అధికారిగా, ప్రతి గ్రామ పంచాయతికి ప్రత్యేక అధికారిని నియమించామన్నారు. సర్పంచ్ అధ్యక్షతన గ్రామ స్థాయి కమిటీని జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయాలన్నారు.