గీసుగొండ, సెప్టెంబర్ 11 : టెక్స్టైల్ పార్కులో అత్యాధునిక టెక్నాలజీతో గణేశ ఇకోటెక్ కంపెనీ నిర్మాణం జరుగుతోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం గీసుగొండ మండలం శాయంపేట గ్రామంలోని టెక్సటైల్ పార్కులో నిర్మిస్తున్న గణేశ ఇకోటెక్ కంపెనీకి ఇటలీ, జపాన్ నుంచి 17 కంటెయినర్లలో వచ్చిన హై క్వాలిటీ మిషనరీని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పరిశ్రమలో వేస్టు ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి దారం, డిజైనింగ్ మెటీరియల్ తయారు చేస్తారని తెలిపారు. దేశంలోనే ప్రప్రథమంగా ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి దారం తయారు చేసే పరిశ్రమ ఇక్కడే నిర్మిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా సీఎం కేసీఆర్ టెక్స్టైల్ పార్కుకు నిధులను కేటాయిస్తూ మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ సమస్యల లేకుండా చూస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో అనేక కంపెనీలో ఎంవోయూ కుదుర్చుకున్నాయని కరోనా కారణంగా పనులు ప్రారంభించ లేదన్నారు. వచ్చే సంవత్సరం జనవరిలో గణేశ ఇకోటెక్ కంపెనీ ప్రారంభమవుతుందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 వేల మందికి ఉగ్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు మొదట అవకాశం కల్పిస్తామన్నారు. మిగతా కంపెనీలు కూడా త్వరలో పనులను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. భూములు కోల్పోయిన రైతులకు ఇళ్ల స్థలాలు కేటాయించి మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు.
దేశంలోనే ఇదే మొదటి పరిశ్రమ..
వేస్టు ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి దారం తయారు చేసే పరిశ్రమ భారత దేశంలోనే ఇదే మొదటిదని గణేశ ఇకో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కేఎస్ రెడ్డి అన్నారు. హై క్వాలిటీ మిషనరీని దిగుమతి చేసుకుంటున్నామన్నారు. త్వరలోనే కంపెనీ నిర్మాణ పనులను పూర్తి చేస్తామన్నారు. 20 ఎకరాల్లో 4 వందల కోట్ల పెట్టుబడితో నిర్మాణం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మేనేజర్ రాకేశ్‌కుమార్, జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సంగెం ఎంపీపీ కందకట్ల కళావతి, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, కూడా డైరెక్టర్ వీరగోని రాజ్‌కుమార్, శాయంపేట మాజీ సర్పంచ్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ..
గీసుగొండ మండలం మనుగొండ మాజీ సర్పంచ్ జక్కు మురళి తండ్రి రామదాసు అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఆయన వెంట జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, కుడా డైరెక్టర్ రాజ్‌కుమార్, సర్పంచ్ నమిండ్ల రమ పాల్గొన్నారు.