ఐఏఎస్ కావాలనేది అతడి కల. అది నెరవేరేందుకు ఎన్ని అవరోధాలు ఎదురైనా పట్టించుకోలేదు. ఓ వైపు 11గంటలు ప్రైవేట్ జాబ్చేస్తూనే సివిల్స్‌కి ప్రిపేరయ్యాడు. మిగతా నాలుగైదు గంటలను పూర్తిగా పుస్తకాలకే కేటాయించి మనసు పెట్టి చదివాడు. తగినంత సమయం లేకున్నా ఉన్న తక్కువ టైమ్‌ను సరిగ్గా వినియోగించుకుంటూ లక్ష్యంపైనే ఫోకస్ పెట్టడం వల్ల మొదటి ప్రయత్నంలోనే 58వ ర్యాంకుతో అనుకున్నది సాధించాడు. ఆయనే భూపాలపల్లి కలెక్టర్ భవేశ్‌మిశ్రా. ఉద్యోగ సాధనలో తాను ఎదుర్కొన్న అనుభవాలను ‘నమస్తే’తో పంచుకున్న ఈ ఐఏఎస్.. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతు న్న యువతకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఉద్యోగార్థులకు బేసిక్స్ తెలిసుండాలని.. పూర్తిగా కోచింగ్‌పైనే ఆధారపడొద్దని, ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా పరీక్షపై దృష్టిపెడితే కొలువు మీదేనని చెప్పారు.
– జయశంకర్ భూపాలపల్లి, మే 29( నమస్తేతెలంగాణ)
ఐఏఎస్ కావాలనే కల ఉంటే సరిపోదు? అది నెరవేరే క్రమంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించి ముందుకుసాగినప్పుడే ‘పరీక్ష’లో నెగ్గుతాం. అందు కోసం లక్ష్యంపై దృష్టిపెట్టడమే కాదు.. సమయాన్ని అనుకూ లంగా మలుచుకొని చదవితే విజయం మీదే అవుతుందంటు న్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్‌మిశ్రా. ప్రస్తుతం పోటీ పరీక్షలకు ఉద్యోగార్థులు సిద్ధమవుతున్న తరుణంలో వారు పాటించాల్సిన సూచనలు, చదవాల్సి సిలబస్, తెలుసుకోవాల్సిన అంశాలను ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా వివరించారు. ఆయన చెప్పిన విషయాలేమిటో ఆయన మాటల్లోనే..
హార్డ్‌వర్క్ చేయాలి..
‘ప్రతి అభ్యర్థికి ఉద్యోగం ఏది అనేది ముఖ్యం కాదు. 90శాతం పలు అంశాలను మనస్సు పెట్టి అవగాహన చేసుకోవాలి. కేవలం 7-8శాతం కోచింగ్ ద్వారా కలిసి వస్తుంది. మహ అయితే ఒక శాతం అదృష్టం కలిసి వస్తుంది. ప్రతి ఒక్కరూ హార్డ్‌వర్క్ మీద ఫోకస్ చేయాలి. ప్రతి క్షణం, ప్రతిరోజు చాలా ముఖ్యమైనవి.
50శాతం టెన్త్ సిలబస్ నుంచే
భారతదేశంలో యూపీఎస్సీ అతిపెద్ద పోటీ పరీక్ష. అందు లో సిలబస్ చాలా పెద్దగా ఉంటుంది. ఇందులో అడిగే ప్రశ్నలు 40-50శాతం ప్రశ్నలు 6వ తరగతి నుంచి 10వ తరగతి సిలబస్ నుంచి అడుగుతుంటారు. ప్రతి ఒక్కరూ పాఠ్య పుస్తకాలను చదవాలి. వాటి దుమ్ము దులిపి మొదటినుంచి క్రమపద్ధతిలో చదవితే ప్రయోజనం ఉంటుంది. వీటిలో హిస్టరీ, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్ వంటివి ప్రామాణికత గల పుస్తకాలుగా భావించాలి.

బేసిక్స్ తెలిసుండాలి..
పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న ప్రతి ఒక్కరికీ బేస్ కరెక్ట్‌గా ఉండాలి. బేసిక్ విషయాలు చదవకుండానే హైస్టాండర్డ్ పుస్తకాలను చదవడం కరెక్ట్ కాదు. అప్పుడు పోటీ పరీక్షలకు ప్రిపేరయినా ఉపయోగం ఉండదరు. పునాది బ లంగా ఉంటేనే భవనం నిలబడుతుంది. అలా లేకపోతే అది కూలిపోతుంది. అదే విధంగా ప్రతి వ్యక్తి బేసిక్స్ తెలిసి ఉండాలి. ప్రస్తుతం ఎక్కువ మంది కోచింగ్ మీదే ఆధారప డుతున్నారు. వారు ఇచ్చే శిక్షణ, మెటీరియల్‌తో ప్రిపేరవు తున్నారు. బేసిక్ గట్టిగా ఉండాలనే విషయాన్ని మర్చి పోతున్నారు.
ఏకాగ్రత చాలా ముఖ్యం..
పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. మన జీవితం కరంట్ స్విచ్ లాంటిది. ఒక స్విచ్ ఆన్, మరొకటి ఆఫ్‌లో ఉంటుంది. అలాగే మీరు పోటీ పరీక్షలు తప్ప మనస్సులో ఎలాంటి ఆలోచనలు రావద్దు. 24/7 మనస్సులో పరీక్షల గురించే ఆలోచించాలి. మన స్సు ఏకాగ్రతతో ఉండాలి. చదువుతున్న సమయం పూర్తి గా కంటెంట్‌పై మాత్రమే కేంద్రీకరించాలి. మనస్సు నిమగ్న చేసి ప్రిపరేషన్ లేకపోతే ఎన్ని గంటలు, రోజులు చదవిన వృథా ప్రయాసే అవుతుంది.
సమయం బంగారం కన్నా విలువైనది..
నేను సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి కేవలం 4 నుంచి 5 గంటలు మాత్రమే కేటాయించాను. సమయం బంగారం కంటే విలువైనది. బంగారం కంటే ఎక్కువ సమయానికి విలువ ఇస్తూ.. సద్వినియోగం చేసుకొని చదువుకునేవాడిని. ఇలా డెడికేషన్‌తో చదివితే ఎలాంటి కఠినమైన పరీక్షనైనా సులభంగా ఎదుర్కోవచ్చు. సెలవు రోజులు శని, ఆదివారాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. భగవద్గీత శ్లోకం ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన!’ మాదిరిగా ఫలితం గురించి ఆలోచించకుండా మనం చేసే ప్రయత్నం చేయాలి. ఫలితం దానంతటదే వచ్చి తీరుతుంది.

11గంటలు పనిచేసేవాడిని
నేను 2015లో సివిల్స్ పరీక్షల సమయంలో ప్రైవేట్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యాను. సివిల్స్ పరీక్ష రాసిన తర్వాత మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూ వరకు అక్కడే పనిచేశాను. ప్రిపేర్ అయ్యేటప్పుడు నా వర్క్ టైం ఉదయం 9నుంచి రాత్రి 8 వరకు ఉండేది. 24గంటలలో 11గంటలు జాబ్ కోసం పోయేది. 6గంటలు నిద్రపోవడానికి, గంట, గంటన్నర భోజనానికి, కాలకృత్యాలకు కేటాయించే వాడిని. అయితే ఇప్పుడు చాలామంది నేను ఇతర పనులు చేస్తున్నాను. సమయం దొరకడం లేదని అంటుంటారు. అలాంటి వారికి నా సూచన ఒక్కటే. పరీక్షలకు సిద్ధమయ్యే వారు పనిచేసుకుంటూ ఎంత సమయం దొరికితే అంత సమయం చదువుకోవాలి.
సోషల్ మీడియాపై ఫోకస్ తగ్గించాలి..
ప్రస్తుతం మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. రోజులో 3నుంచి 4గంటలు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లతో గడిపేస్తున్నారు. వీటన్నింటిని పక్కన పెట్టాలి. సోషల్ మీడియాకు కొద్దిరో జులు దూరంగా ఉంటూ పరీక్షల ప్రిపరేషన్ మీద ఫోకస్ పెట్టాలి. వచ్చే మూడు నెలల సమయం చాలా ముఖ్యమైనది. వృథా చేయకుండా సమయపాలన పాటించాలి.
ప్రీవియస్ పేపర్లనుపరిశీలించాలి
అభ్యర్థులు ఏ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా సరే.. ఒకసారి 10 లేదా 15 సంవత్సరాల ప్రీవియస్ పేపర్లను పరిశీలించాలి. లేదా చివరి పోటీ పరీక్షల సమయంలో చివరి 5నుంచి 6 ప్రశ్నలు ఏమేమి అడిగారు అనే విషయాలపై అవగాహన ఉండాలి. గతంలో ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు పాత పరీక్షలు ఎప్పుడు జరిగాయి? ఈ పరీక్షల్లో ఏమేం ప్రశ్నలు అడిగారు? ఆ ఎగ్జామ్‌లో అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి? ఏ సిలబస్ ప్రకారం అడిగారు? అనే విషయాలను గమనించాలి. అప్పుడే పరీక్షల్లో అడుగుతున్న ప్రశ్నలపై మీకు ఒక ఐడియా వస్తుంది. రానున్న పరీక్షలలో ఈ ప్రశ్నలు అడుగుతారు అనే అవగాహన కలిగి ఉండాలి.