నల్లబెల్లి, ఆగస్టు 10 : అరుదైన అగ్నిశిఖ మొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ పల్లె ప్రకృతివనంలో విరబూసి కనువిందు చేస్తున్నది. ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్కను, పుష్పాలను ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తారు. వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపూర్ పల్లెప్రకృతి వనంలో అగ్నిశిఖ పూలు ఆకట్టుకుంటున్నాయి. అగ్నిశిఖ మొక్కను నాభి, అడవినాభి, నాగేటిగడ్డ అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయనామం గ్లోరియోసాసుపర్సా. ఇంగ్లిష్లో ప్లేమ్లిల్లీ, గ్లోరీలిల్లీ అని అంటారు. ఈ మొక్క అటవీప్రాంతంలో వానకాలంలోనే మొలకెత్తుతూ పక్కన ఉండే చెట్లను ఆధారంగా చేసుకుని ఎగబాకుతుంది. వీటి పుష్పాలు అగ్నికీలల్లా ఎరుపు రంగుతో కూడిన నారింజ రంగు, పసుపు రంగుతో కూడిన తెలుపు రంగు కలిగి ఉండి ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి.
అగ్నిశిఖ ఉపయోగాలు..
అగ్నిశిఖ పూలను దంచి పేస్టులా చేసి ఔషధంలా వాడితే అంత్రాక్స్ కూడా నయమవుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మొక్క గడ్డలను సైతం పేస్టుగా చేసి తేలు కాటు వేసిన చోట రాస్తే విషాన్ని హరిస్తుంది. మొక్క గడ్డల రసంతో పక్షవాతాన్ని కూడా నయం చేయవచ్చని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు. గడ్డ పేస్టును బట్ట తలపై రాస్తే కొంత ఫలితం ఉంటుందని చెబుతున్నారు. కానీ, ఈ మొక్క పూర్తిగా విషపూరితమైనందున తలపై పేస్టు రాసే సమయంలో కళ్లలో పడకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. మొక్క ఆకులను పేస్టుగా చేసి మోకాళ్లు, నడుము నొప్పులు ఉన్న చోట రాస్తే నొప్పులు తగ్గుతాయని, గడ్డ పేస్టును పాము కాటు వేసిన చోట రాస్తే విషాన్ని హరిస్తుందని చెబుతున్నారు. ఆకులను దంచి ఛాతిపై రాస్తే అస్తమా నయమవుతుందని, కుష్టు నివారణకు కూడా ఈ మొక్క ఔషధంలా పనిచేస్తుందని పేర్కొంటున్నారు. అగ్నిశిఖ మొక్కను కొన్ని దేశాల్లో ప్రత్యేకంగా సాగు చేస్తున్నట్లు తెలిపారు.
ఇక్కడ వికసించడం అద్భుతం
అనేక ఔషధ గుణాలు కలిగిన అగ్నిశిఖ మొక్క కొండాపూర్ పల్లెప్రకృతి వనంలో వికసించడం అద్భుతం. వైద్యుల సలహా తీసుకోకుండా ఈ మొక్కతో ఎవరూ ప్రయోగాలు చేయొద్దు. ఈ మొక్కపై పరిశోధనలు చేస్తే స్థానిక అటవీ ప్రాంతంలో విరివిగా అగ్నిశిఖ మొక్కలు లభ్యమయ్యే అవకాశాలున్నాయి.
మొక్క విషపూరితం
అగ్నిశిఖ మొక్కలోని ప్రతి భాగం అత్యంత విషపూరితమైందని, మొక్కలో ప్రమాదకరమైన కొల్చిసీల్, గ్లోరియోజిన్ అనే ఆల్కలాయిడ్స్ ఉంటాయని, వైద్యుల సలహాలు లేనిదే అగ్నిశిఖ మొక్కను ఔషధంగా వాడరాదని ఆయుర్వేద వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ఔషధాన్ని పైపూతగా మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. తినడం, రసం తాగడం లాంటివి చేయవద్దని చెబుతున్నారు.