పోడు భూముల సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ గోపి అధికారులను ఆదేశించారు. కొండాపూర్, లైన్‌తండా గ్రామాల్లో జరుగుతున్న ఆర్వో ఎఫ్ఆర్ పోడు భూముల సర్వేను కలెక్టర్ శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. 2005 సంవత్సరానికి ముందు పోడు చేసుకుని జీవనం కొనసాగిస్తున్న గిరిజన, గిరిజనేతర రైతులకు పట్టాలందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా సర్వే చేయించుకోవాలని సూచించారు. నల్లబెల్లి మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో 700 ఎకరాల భూములకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇవ్వనుందని ఆయన పేర్కొన్నారు.
నల్లబెల్లి, అక్టోబర్ 28: పోడు భూముల సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ గోపి అధికారులను ఆదేశించారు. మండలంలోని కొండాపూర్, లైన్‌తండాలో జరుగుతున్న ఆర్వోఎఫ్ఆర్ సర్వే పనులను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005 సంవత్సరానికి ముందు పోడు చేసుకొని జీవనం సాగిస్తున్న ప్రతి గిరిజన, గిరిజనేతర రైతుకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అధికారులు త్వరితగతిన సర్వే పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అర్హులైన రైతులు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ భూములను సర్వే చేయించుకోవాలని సూచించారు. భూముల సర్వేలో ఏదేనా సమస్య ఉంటే తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న 1969-70 సంవత్సరంలోని పహాణీల ఆధారంగా సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో రైతులు పోడు చేసుకున్న 700 ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నందున సర్కారు ఆదేశాల మేరకు సర్వే చేయాలని అధికారులకు సూచించారు.
అర్హులైన ప్రతి పోడు రైతుకూ న్యాయం జరిగేలా కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సర్వే పనులు పూర్తయిన తర్వాత నిబంధనల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీల ద్వారా పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనంతరం గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలు గ్రామాలకు చెందిన ప్రజలు కలెక్టర్‌కు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సాహితీమిశ్ర, తహసీల్దార్ దూలం మంజుల, ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్, సర్పంచ్‌లు కరివేదుల వెంకట్‌రెడ్డి, గూబ తిరుపతమ్మ, ఏపీవో వెంకటనారాయణ, కార్యదర్శి రజిత పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్/ఖానాపురం: పోడు భూముల సర్వే నర్సంపేట మండలంలో యుద్ధప్రాతిపదికన జరుగుతున్నది. ఆకులతండాలో ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులు పోడు భూముల సర్వే నిర్వహించారు. రైతులు చేసుకున్న దరఖాస్తులు, అన్ని రకాల రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో ఎఫ్‌బీవో చంద్రమౌళి, కార్యదర్శులు శ్రీధర్, రవిచంద్ర, ఎఫ్ఆర్సీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే, ఖానాపురం మండలవ్యాప్తంగా పోడు భూముల సర్వే కొనసాగుతున్నది. శుక్రవారం ధర్మారావుపేటలో చేపట్టిన సర్వేను ఎంపీడీవో సుమనావాణి పరిశీలించారు. అటవీ శాఖ అధికారులు సర్వేకు ముందు రోజే 30 మంది రైతులకు నోటీసులు అందజేసి ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యుల సమక్షంలో మరుసటి రోజు సర్వే చేపడుతున్నారని ఆమె వివరించారు. సర్వేను ప్రభుత్వ నిబంధనలకు లోబడి పారదర్శకంగా చేపట్టినట్లు వెల్లడించారు. సర్పంచ్ వెన్ను శ్రుతి, పూర్ణచందర్, బీట్ ఆఫీసర్ రమేశ్, ఎఫ్ఆర్సీ సభ్యులు వెంకన్న, బాలు, విజయాకర్ పాల్గొన్నారు.