భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 5: పిల్లల్లో వచ్చే శ్వాసకోశ వ్యాధులకు చెక్ పెట్టేందుకు వైద్యారోగ్యశాఖ పీసీవీ (న్యూ మోకొక్కల్ కాంజుగేట్ వ్యాక్సిన్) టీకాను అందిస్తున్నది. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరాం ప్రత్యేకంగా వైద్య అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇవ్వగా, వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను వారం క్రితం ప్రారంభించారు. జిల్లాలో 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కు వ్యాక్సిన్ను సరఫరా చేశారు. పీహెచ్సీలు, సీహెచ్సీలతోపాటు జిల్లాలో ఉన్న 90 సబ్ సెంటర్లలో ఈ టీకాను పిల్లలకు అందిస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం ప్రైవేటు దవాఖానల్లోనే ఈ టీకాను అందించేవారు. కాగా ఈ టీకాను కొనుగోలు చేసి వేయించుకోవడం ప్రజలకు ఆర్థికంగా భారమవుతుందని గమనించిన ప్రభుత్వం అన్ని సర్కారు దవాఖానలు, అంగన్వాడీ కేంద్రాల్లో అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం జిల్లాకు 1250 డోసులు సరఫరా చేయగా, 1050 డోసులకు పీహెచ్సీలు, సీహెచ్సీలకు సరఫరా చేసింది. మరో 200 డోసులు నిల్వ ఉన్నాయి.
న్యుమోనియా నుంచి రక్షణకు..
న్యూ మోకొక్కల్ అనేది స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా అనే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధుల సమూహం. ఐదేళ్ల లోపు చిన్నారుల్లో వచ్చే న్యు మోనియాకు ఇదే ప్రధాన కారణం. వీటిని అధిగమించేందుకు పీసీవీ టీకా వినియోగిస్తారు. పిల్లల్లో అంటువ్యాధులు సోకకుండా, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తకుండా వైద్యులు ఈ టీకా వేస్తారు. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ర్టాల్లో ఈ టీకాను ప్రభుత్వాలు ఉచితంగా అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వారం క్రితం ప్రారంభించారు. పిల్లల్లో న్యుమోనియా, మెనింజైటిస్ వంటి వ్యాధులు వ్యాపించకుండా ఈ టీకా కట్టడి చేయనుందని వైద్యులు తెలుపుతున్నారు.
డోసులు ఇలా..
పుట్టిన ఆరు వారాలకు మొదటిది, 14 వారాలకు రెండోది.. తొమ్మిది నెలలకు మూడోది (బూస్టర్ డోసు) వేయించాలి. ఆలస్యమైతే పుట్టిన రోజుకు ముందు కనీసం ఒక మోతాదు పీసీవీని వేసి మిగతా వాటిని ఇవ్వ వచ్చని వైద్యులు తెలుపుతున్నారు. మొదటి సంవత్సరంలో ఆలస్యమైతే (2 ప్రాథమిక, బూస్టర్) కనిష్ఠంగా ఎనిమిది వారాల విరామంతో వేరు చేసి తదుపరి డోసు ఇవ్వాల్సి ఉంటుంది. టీకాపై వైద్య ఆరోగ్యశాఖ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నది. టీకాపై ప్రజల్లో మరింత అవగాహన పెంచడానికి స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేస్తున్నారు. చాలా ఖరీదైన ఈ వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకోవాలని, మూడు డోసులు ప్రభుత్వ దవాఖానల్లో వేసుకోవాలని, ఒక డోసు ప్రైవేటులో వేసుకుని మిగిలిన డోసులకు ప్రభు త్వ హాస్పిటళ్లకు వస్తే వేయరని ప్రజలకు గుర్తు చేస్తున్నారు.
కనిర్భయంగా వ్యాక్సిన్ వేసుకోవాలి
చిన్న పిల్లలకు సంక్రమించే శ్వాసకోశ వ్యాధి న్యుమోనియా. దీన్నుంచి రక్షణ కోసం పిల్లలు నిర్భయంగా న్యూ మోకొక్కల్ కాంజుగేట్ వ్యాక్సిన్(పీసీవీ) తీసుకోవాలి. సకాలంలో టీకాలు తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జిల్లాలో వారం క్రితం ప్రారంభమైంది. మూడు డోసుల్లో ఈ పీసీవీ టీకా పిల్లలకు అందించాలి. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో టీకా అందుబాటులో ఉంది.