కరీమాబాద్, సెప్టెంబర్ 5: గురువులు విద్యార్థులకు పుస్తకంలోని పాఠాలతోపాటు ప్రపంచ విషయాలను నేర్పించాలని కలెక్టర్ గోపి సూచించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హాల్లో ఆదివారం గురుపూజోత్సవం, ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులు ఉన్నత విద్యావంతులన్నారు. ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యనభ్యసించినట్లు గుర్తుచేసుకున్నారు. తాను ఐఏఎస్ సాధించినప్పుడు గురువు వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నట్లు వెల్లడించారు.
గురువులకు ప్రత్యేక స్థానం
సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం ఉందని కలెక్టర్ అన్నారు. గురువులు సమాజ మార్పునకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి ఉద్యోగి సంస్థ అభివృద్ధి చెందేలా పాటుపడాలన్నారు. గతంతో పోల్చితే ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నట్లు వివరించారు. వాటన్నింటినీ నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు ఏటా ఉత్తమంగా నిలిచేలా కృషి చేయాలన్నారు. విద్యార్థుల జీవితాల్లో చీకటిని తరిమి వెలుగులు నింపే వారే ఉపాధ్యాయులన్నారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానం ఉపాధ్యాయులదే అని గుర్తుచేశారు. గురువులే విద్యార్థులకు మార్గదర్శకులన్నారు. తాను కలెక్టర్‌గా ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందేందుకు దోహదపడిన అంశాలను ఇతరులు సైతం నేర్చుకోవాలని సూచించారు.
విద్యార్థి ఎదుగుదలకు దోహదం
ప్రతి ఒక్కరూ ఒకప్పుడు విద్యార్థులేనని అదనపు కలెక్టర్ హరికిషన్‌సింగ్ అన్నారు. గురువుల వద్ద చదవుకునే ఉన్నత స్థానాలకు చేరుకుంటామన్నారు. ప్రతి విద్యార్థి ఎదుగుదలకు గురువులే కారణమన్నారు. డీఈవో డీ వాసంతి మాట్లాడుతూ జిల్లాలో 39 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందారన్నారు. కరోనా కాలంలోనూ ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని విద్యాబోధన చేశామన్నారు. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాతోపాటు పలు రకాలుగా విద్యను నేర్పించామన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నామన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన పలువురి అనుభవనాలను వారి మాటల్లోనే తెలుసుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల కోమల, ఎంఈవో విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తములకు అవార్డులు
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా వరంగల్ సీకేఎం ఆర్ట్స్‌అండ్‌సైన్స్ డిగ్రీ కళాశాల లైబ్రేరియన్ సంగరబోయిన అనిల్‌కుమార్ ఆదివారం అవార్డు అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనిల్‌కుమార్‌కు గోల్డ్‌మెడల్, మెమెంటో, ప్రశంసాపత్రం, రూ. 10 వేల చెక్కు అందజేసి శాలువాతో సన్మానించారు. అలాగే, గీసుగొండ మండలం గొర్రెకుంట జడ్పీఎస్ఎస్ గణిత టీచర్ తౌటం నిహారిక ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా అందుకున్నారు.