వరంగల్, ఆగస్టు 31(నమస్తేతెలంగాణ) : కరోనాతో మూతపడిన పాఠశాలలు బుధవారం తెరుచుకోనున్నాయి. పనిదినాల్లో ప్రతి రోజూ బడి గంట మోగనుంది. విద్యార్థులు బడి బాట పట్టనున్నారు. పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతి బోధన జరగనుంది. కరోనా మహమ్మారితో పాఠశాలలు గత ఏప్రిల్ 24 నుంచి మూతపడ్డాయి. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం జూలై ఒకటి నుంచి ఆన్లైన్ బోధన ప్రవేశపెట్టింది. విద్యాశాఖ అధికారులు 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు రూపొందించి వివిధ మాధ్యమాల ద్వారా ప్రసారం చేశారు. విద్యార్థులు టీవీలు, ల్యాప్‌టాప్‌లు, చరవాణీల ద్వారా వీక్షించారు. సెప్టెంబరు ఒకటి నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడదల చేసింది. పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరుకావాలని, సెప్టెంబరు ఒకటి నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. రాష్ట్ర పరిధిలో గల అన్ని యాజమాన్య పాఠశాలల్లో స్వచ్ఛత కార్యక్రమాలు, తరగతి గదుల శుభ్రత, పరిసరాలు, క్రీడా మైదానంలో పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు, మరుగుదొడ్ల శుభ్రత, వంట గది, పాత్రల శుభ్రత, శానిటైజేషన్ చేయాలని పేర్కొంది. దీంతో జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశమై ఆగస్టు 30వ తేదీలోగా పాఠశాలలన్నింటినీ శుభ్రం చేసి సెప్టెంబరు ఒకటి నుంచి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఈ నేపథ్యంలో పాఠశాలలను రెడీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి డీ వాసంతి జిల్లాలో నలుగురు మండల విద్యాధికారులు, 9 మంది నోడల్ అధికారులను నియమించారు. ఈ 13 మంది అధికారులు జిల్లాలోని ప్రభుత్వ, లోకల్‌బాడీ, ప్రైవేట్, ఇతర యాజమాన్య పాఠశాలల్లో శానిటేషన్ పనులను పర్యవేక్షించారు. స్వచ్ఛత కార్యక్రమాలు పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్, జీడబ్ల్యూఎంసీ సిబ్బంది ఆయా పాఠశాల పరిసరాలు, క్రీడా మైదానం, తరగతి, వంట గదులను, టాయిలెట్స్‌ను శుభ్రం చేశారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ పనుల పురోగతిని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. బుధవారం నుంచి ప్రారంభానికి, ప్రత్యక్ష తరగతుల బోధనకు పాఠశాలలన్నింటినీ సిద్ధం చేసినట్లు హెచ్ఎంలు, ఎంఈవోలు, ఎంపీడీవోలు జిల్లా కలెక్టర్‌కు సోమవారం నివేదిక పంపారు. జిల్లా కలెక్టర్ ఎం హరిత, అదనపు కలెక్టర్ బీ హరిసింగ్, డీఈవో వాసంతి జిల్లాలోని పలు పాఠశాలలను సందర్శించి, శానిటైజేషన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
1,015 పాఠశాలల్లో బోధన
జిల్లాలో ప్రభుత్వ, లోకల్‌బాడీ, ఇతర యాజమాన్యాల పాఠశాలలు 1,025 ఉన్నాయి. వీటిలో 1,26,049 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. 1,025 పాఠశాలల్లో ప్రైవేట్ స్కూళ్లు 257. వీటిలో 70,824 మంది విద్యార్థులు ఉన్నారు. మిగతా 768 పాఠశాలలు ప్రభుత్వానివే. వీటిలో 55,225 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. 768 స్కూళ్లలో 722 ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు 61 ప్రైవేట్ ఎయిడెడ్, 10 కేజీబీవీలు, 6 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ఇతర పాఠశాలల్లో నవోదయతో పాటు ఇతర యాజమాన్య స్కూళ్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం నుంచి రెసిడెన్షియల్, హాస్టల్ వసతి ఉన్న పాఠశాలలు మాత్రమే ఓపెన్ కావడం లేదు. ఈ లెక్కన జిల్లాలోని 10 కేజీబీవీల్లో ప్రత్యక్ష తరగతి బోధన ప్రారంభించడం లేదని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. దీంతో జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన 1,015 పాఠశాలల్లో బుధవారం నుంచి ప్రత్యక్ష తరగతి బోధన ప్రారంభం కానుందని వెల్లడించారు. ఈ 1,015 పాఠశాలల్లో 1,23,760 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరందరూ ఆన్లైన్ తరగతులకు గుడ్‌బై చెప్పి ఆఫ్‌లైన్‌లో ప్రత్యక్ష పద్ధతిన పాఠశాలల్లో జరిగే తరగతి బోధనకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రత్యక్ష తరగతి బోధనకు ఎవరినీ ఒత్తిడి చేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. బుధవారం నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతి బోధన ప్రారంభంపై మంగళవారం డీఈవో వాసంతి జిల్లాలోని విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రదానోపాధ్యాయులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు.
కరోనా నిబంధనలు పాటించాలి…
జిల్లాలో కేజీబీవీలు మినహా ఇతర అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో బుధవారం నుంచి ప్రత్యక్ష తరగతి బోధన ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు జరిగాయి. ప్రతి పాఠశాల పరిసరాలు, క్రీడా మైదానం, తరగతి గదులు, కిచెన్ గది, టాయిలెట్స్‌ను శుభ్రపరిచి విద్యార్థులకు స్వాగతం పలికేలా సిద్ధం చేశాం. పాఠశాలలోని ఉపాధ్యాయులు, వర్కర్లతో పాటు విద్యార్థులు కరోనా నిబంధనలు పాటించాలి. తప్పనిసరిగా మాస్కు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. మధ్యాహ్న భోజనం, తాగునీరు, టాయిలెట్స్ వద్ద గుంపులు గుంపులుగా ఉండకుండా ఉపాధ్యాయులతో కమిటీలు ఏర్పాటు చేశాం. సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎం ఫోన్ నంబర్లు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద ఉంటాయి. ప్రతి పాఠశాలలో చేతులు శుభ్రం చేసుకోవడానికి నీటితో పాటు సబ్బు లేదా శానిటైజర్ గాని కచ్చితంగా ఉంటుంది.