వరంగల్, ఆగస్టు 16 : ‘దళితబంధు’ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేలాది మంది తరలివెళ్లారు. దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రూ.10 లక్షలు సాయం అందించే దళితబంధు పథకాన్ని దళిత యువత స్వాగతిస్తూ సంబురంగా సభకు బయల్దేరారు. వాహనాల ముందు నృత్యాలు చేస్తూ సీఎం కేసీఆర్ జిందాబాద్ అంటూ నినదించారు. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్ల నుంచి దళితులు సభకు కదిలారు. ప్రతి పల్లె నుంచి బస్సులు బైలెల్లగా, వరంగల్ జిల్లా పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, హన్మకొండలో చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ బస్సులకు జెండా ఊపి వాహన శ్రేణిని ప్రారంభించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో వందలాది వాహనాల్లో దళితులు బయలుదేరి వెళ్లారు.
ముగ్గులు వేసి.. సంబురాలు చేసి..
కమలాపూర్ మండలంలోని దళితబంధు సభకు దళితులు సంబురంగా కదిలారు. పథకం ప్రారంభమవుతున్న సంతోషంలో ఆడబిడ్డలు ముగ్గులు వేశారు. దళిత కాలనీల్లో ఉదయం నుంచే దండోరా వేసి సభకు తరలివెళ్లాలని ప్రచారం చేశారు. మండలంలోని 23 గ్రామాల నుంచి 120 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. అయినా వాహనాలు సరిపోకపోవడంతో ఆటోట్రాలీలు, ఆటోలు, బైక్‌లపై సుమారు 20వేల మంది వెళ్లారు. ఇలా అందరూ హుజూరాబాద్ సభకు వెళ్లడంతో దళిత బస్తీలన్నీ వెలవెలబోయాయి. మండలకేంద్రంలో విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మండల ఇన్చార్జి డాక్టర్ పేర్యాల రవీందర్రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి స్థానికులతో కలిసి ఆర్టీసీ బస్సులో సీఎం సభకు వెళ్లారు. వాహనాలు కమలాపూర్, ఉప్పల్, హుజూరాబాద్ మీదుగా శాలపల్లికి చేరుకునేందుకు ఏర్పాటు చేశారు.