హన్మకొండ/కమలాపూర్, ఆగస్టు 10 : తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారని, అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు స్కాంలో డాక్టరేట్ పొందిన రేవంత్‌రెడ్డివి బ్లాక్మెయిల్, చౌకబారు రాజకీయాలని దుయ్యబట్టారు. ఇంద్రవెళ్లి సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలన్నీ అవాస్తవాలే అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన దళిత, గిరిజన బిడ్డలను కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు గిరిజనులపై వివక్ష చూపాయని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌తో డబ్బు సంపాదించి రాజకీయం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. అతడి మోసపూరిత మాటలను దళిత, గిరిజనులు నమ్మరన్నారు. చంద్రబాబు నాయుడు ఏజెంట్‌గా రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ కనుమరుగైనందున చంద్రబాబు ఏజెంటుగా ఉంటూ కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేసేందుకే అందులో చేరాడన్నారు. చంద్రబాబు సాయంతోనే డబ్బులు పెట్టి, పీసీసీ పదవి తెచ్చుకున్నాడని విమర్శించారు. ఇంద్రవెళ్లి సభ కాంగ్రెస్ సభ కాదని, రేవంత్‌రెడ్డి షో సభ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉన్నారని, దమ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్ తెచ్చుకోవాలని రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. ఇప్పటికైనా బ్లాక్మెయిల్ రాజకీయాలు, తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్‌కుమార్, టీఆర్ఎస్ నాయకుడు జనార్దన్‌గౌడ్ పాల్గొన్నారు.
దళితబంధు అమలుతో ఆత్మరక్షణలో బీజేపీ
ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం అమలు చేయడంతో బీజేపీ నాయకులు ఆత్మరక్షణలో పడిపోయారని బాల్కసుమన్ ఎద్దేవా చేశారు. కమలాపూర్ మండలం గుండేడు, కొత్తపల్లి, కన్నూరులో నిర్వహించిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. దళితబంధు పథకం హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేయొద్దని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. దళితబంధు పథకం మొదలైతే దళితులు తమను ఆదరించరని, గ్రామాల్లో ఉనికి కోల్పోతామని ఆగమైతుండ్రని, దళితులు అంటేనే బీజేపీకి పడదన్నారు. దళితులను ఆలయాల్లోకి రాకుండా ఊరికి దూరంగా దళిత కాలనీలను ఉంచిందే బీజేపీ అని మండిపడ్డారు. దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే సామాజిక వివక్ష పోతుందని కేసీఆర్ దళితబంధు పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. చెప్పులు కుట్టే చేతులే అప్పులిచ్చే స్థాయికి ఎదుగాలని ఆకాక్షించారు. ‘ఈటల రాజేందర్ రాజీనామాతోనే దళితబంధు వచ్చిందని చెప్పుకుంటున్నడు.. దళితుల సంక్షేమాన్ని బీజేపీ ఏనాడన్న పట్టించుకున్నదా? బీజేపీ నాయకులు పెట్టరు, పెట్టే కేసీఆర్‌ను పెట్టనీయరు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ జడ్పీటీసీ లాండిగ కల్యాణి, సర్పంచ్‌లు బండారి కల్యాణి, పుల్లూరి రాంచందర్‌రావు, లక్ష్మణ్‌రావు, సింగిల్ విండో చైర్మన్ సంపత్‌రావు, మండల ఇన్చార్జి డాక్టర్ పేర్యాల రవీందర్రావు, సింగిల్ విండో డైరెక్టర్ సత్యనారాయణరావు పాల్గొన్నారు.
పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం
కమలాపూర్ మండలకేంద్రంలో జరిగిన పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనానికి సైతం బాల్క సుమన్ హాజరయ్యారు. కేసీఆర్ 2001లో సిద్దిపేట గడ్డ నుంచి ఒక్కడిగా బయలుదేరి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబునాయుడు, ఆంధ్ర మీడియా కుట్రలను తట్టుకుని తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని గుర్తు చేశారు. తెలంగాణను ఆంధ్రా పాలకుల నుంచి విముక్తి చేసేందుకు కేసీఆర్ పడిన కష్టాలు ప్రజలంతా టీవీల్లో చూశారని, అన్ని రకాల ఇబ్బందులు తట్టుకుని రాష్ర్టాన్ని సాధించడం వల్లే ప్రజలంతా సంతోషంగా బతుకుతున్నారన్నారు. ప్రజలు అడగని కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు వంటి పథకాలు కళ్లముందు కనబడుతున్నాయని, కరంటు కష్టాలు పోగొట్టి 24 గంటల కరంటు సరఫరా చేస్తున్న ఘనత కేసీఆర్‌దేనన్నారు. కరోనా కష్టాలు వచ్చినా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. 57ఏళ్లు నిండిన వారికి త్వరలోనే రూ.2వేల పింఛను ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీటీసీ మెండు రాధిక, పారిశ్రామిక వేత్త, టీఆర్ఎస్ నాయకుడు స్వర్గం రవి, మండల ఇన్చార్జి డాక్టర్ పేరియాల రవీందర్రావు, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, పీఏసీఎస్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్ తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, పద్మశాలి సంఘం నాయకుడు తుమ్మ సారంగం పాల్గొన్నారు.