భూపాలపల్లి రూరల్, ఆగస్టు 8 : కాలానికనుగుణంగా విద్యాబోధనలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా నిష్ట 2.0(నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్) ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టాయి. ఈ మేరకు ఈ నెల 3 నుంచే శిక్షణ ప్రారంభమైంది. ఐదు నెలల పాటు కొనసాగనుంది. ప్రాథమికోన్నత, ఉన్నత, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల ఉపాధ్యాయు లు ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. డీఈవోలు దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకుని గుణాత్మక విద్య అందించేందుకు ఈ శిక్షణ దోహదం చేస్తుంది.
భూపాలపల్లి నుంచి 818 మంది ఉపాధ్యాయులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న 818 మంది ఉపాధ్యాయులు నిష్ట2.0 ఆన్లైన్ శిక్షణలో పాల్గొంటున్నారు. ఇందులో తెలుగు బోధించే ఉపాధ్యాయులు 98 మంది, హిందీ 77, ఇంగ్లిష్ 90, గణితం 146, ఫిజికల్ సైన్స్ 114, బయాలాజికల్ సైన్స్ 98, సాంఘికశాస్త్రం 102, స్కూల్ హెడ్స్ 93 మంది ఉన్నారు. ఐదు నెలల పాటు జరిగే ఈ ఆన్లైన్ శిక్షణకు ఎలాంటి ఆటంకాలు జరుగకుండా విద్యాశాఖ అన్ని చర్యలు తీసుకున్నది. ప్రతి నెలలో మూడు మాడ్యుల్స్ ఉంటాయి. వీటన్నింటిని కూడా అదే నెలలో పూర్తి చేయాలి. ప్రతి నెలలో 20 ప్రశ్నలకు సమాధానాలిచ్చి 70 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 70 శాతం మార్కులు సాధించేందుకు మూడు అవకాశాలు కూడా ఇస్తారు. 70 శాతం మార్కులు సాధించిన ఉపాధ్యాయుడికి కోర్సు పూర్తి చేసిన సర్టిఫికెట్ వస్తుంది.
లాగిన్ కావడం ఇలా..
నిష్ట 2.0 శిక్షణకు ఉపాధ్యాయులు తెలంగాణ దీక్ష(డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జి షేరింగ్) పోర్టల్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. diksha.gov.in/ telangana వెబ్సైట్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే పైన రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి. అందులో మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీని ఎంటర్ చేసి పాస్వర్డ్ నమోదు చేసుకోవాలి. తర్వాత పుట్టిన తేదీ, పేరు, మొబైల్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మొబైల్‌కు వచ్చిన ఓటీపీని సబ్మిట్ చేయాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ విజయవంతమవుతుంది. తర్వాత మొబైల్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి, లాగిన్ అయిన తర్వాత రాష్ట్రం, మీడియం ఎంటర్ చేయాలి. లాగిన్‌లో టీచర్, స్టూడెంట్, ఇతరులు అనే బొమ్మలు కనిపిస్తాయి. వీటిపై క్లిక్ చేయగానే జిల్లా ఇతర వివరాలు, తర్వాత కోర్సు వివరాలు, మాడ్యూల్స్ కనిపిస్తాయి.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
నిష్ట పేరుతో ఉపాధ్యాయులకు ఆన్లైన్లో అందించే శిక్షణను ప్రతి ఉపాధ్యాయుడూ సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధ్యాయులు తప్పకుండా శిక్షణలో పాల్గొనాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. ఈ శిక్షణ వల్ల ఉపాధ్యాయులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. 70 శాతం మార్కులు సాధించిన ఉపాధ్యాయుడికి కోర్సు పూర్తి చేసిన సర్టిఫికెట్ అందుతుంది.