వరంగల్, మే 1 : రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ స్పోర్ట్స్ హబ్‌గా మారుతోంది. పలు జాతీయస్థాయి పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన ఓరుగల్లు క్రీడలకు వేదిక కానుంది. ఈక్రమంలోనే ఇటీవల నగరానికి వచ్చిన మంత్రి కేటీఆర్ రూ.4 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా జీడబ్ల్యూఎంసీ కార్యాలయ ఆవరణలోని ఇండోర్ స్టేడియం పక్కన ఉన్న సుమారు రెండెకరాల స్థలంలో బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. దీంతో పాటు జాతీయ స్థాయి పోటీల నిర్వహణ కోసం లైన్ స్విమింగ్ పూల్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోసం ప్రత్యేకంగా పిచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండడంతో క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చారిత్రక వరంగల్ నగరం క్రీడా వేదిక గా మారనుంది. ఎన్నో జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఆతి థ్యం ఇచ్చిన ఓరుగల్లులో రూ. 4 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. త్వరలో నిర్మాణ పనులు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ తరహాలో వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు పోతోంది. క్రీడానగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దాలనే ఆలోచనతో అడుగులు వేస్తోంది.
రూ.4 కోట్లతో క్రీడా కాంప్లెక్స్..
కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని ఇండోర్ స్టేడియం పక్కన ఉన్న రెండు ఎకరాలకు పైగా ఉన్న స్థలంలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేయనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ స్థాయి పోటీలు నిర్వహించే విధంగా లైన్ స్విమింగ్ పూల్ నిర్మిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోసం ప్రత్యేకంగా పిచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. కాంప్లెక్స్‌లో రూ. 4 కోట్ల పట్టణ ప్రగతి నిధులతో వాకింగ్ ట్రాక్, డ్రెస్సింగ్ రూమ్‌లు, స్విమింగ్ పూల్తో పాటు రాత్రి సమయంలో క్రీడ లు నిర్వహించేలా లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
జాతీయ, అంతర్జాతీయ పోటీలు..
రాబోయే రోజుల్లో నగరం జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేలా అన్ని వసతులను సమకూర్చుకుంటోంది. ఇప్పటికే జేఎన్ఎస్తో పాటు పక్కనే ఇండోర్ స్టేడి యం ఉంది. అనేక జాతీయ స్థాయి క్రీడా పోటీలకు అతిథ్యం ఇచ్చిన వేదికలుగా చరిత్ర ఉంది. కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మరో ఇండోర్ స్టేడియం ఉంది. బ్యాడ్మింటన్, జూడో పోటీలు నిర్వహించారు. వందలాది మంది క్రీడాకారులు జేఎన్ఎస్, ఇండోర్ స్టేడియాల్లో శిక్షణ పొందుతున్నారు. వీటికి తోడుగా ప్రభుత్వం అత్యాధునిక వసతులతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో వరంగల్ స్పోర్ట్స్ హబ్‌గా మారనుంది. కొత్త క్రీడాకారులను తయారుచేసే వేదికలు అందుబాటులోకి రానున్నాయి.