కమలాపూర్, ఆగస్టు 9: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, మంత్రి హరీశ్‌రావును విమర్శించే స్థాయి ఈటల రాజేందర్‌కు లేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళిత బంధు కోసం హుజూరాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.500కోట్లు కేటాయించడంపై కమలాపూర్‌లో స్థానిక నేతలతో కలిసి సోమవారం పటాకులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ‘బీజేపీ నేత ఈటల రాజేందర్ నిన్నమొన్న మాట్లాడుతుండు.. రా కేసీఆర్, రా హరీశ్‌రావు దమ్ముంటే ఇక్కడ పోటీచెయ్ అంటుండు.. ఎక్కడో కోళ్లఫాంలో ఉన్నోన్ని తీసుకువచ్చి ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఫ్లోర్ లీడర్‌గా, రెండు సార్లు మంత్రిగా చేసింది కేసీఆరేనని గుర్తుపెట్టుకోవాలె’ అంటూ హితవుపలికారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్యకర్తను నిలబెట్టి గెలిపించుకుంటమని సవాల్ విసిరారు. నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. కేసీఆర్ రాజకీయ భిక్షపెడితే ఇతర పార్టీల నాయకులతో చేతులు కలిపి పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు ఈటల కుట్ర పన్నారని విమర్శించారు. నియోజకవర్గంలో దళితులను, యాదవులను, రజకులను ఏ ఒక్క కులాన్నీ విడిచిపెట్టకుండా పోలీసులతో కేసులు పెట్టించి తొక్కించాడని, ఏ ఒక్క వ్యక్తినీ ఎదుగకుండా నిరంకుశంగా పాలించాడని దుయ్యబట్టారు.
‘నియంతలా పాలించిన వ్యక్తి కావాలా? నియోజకవర్గంలో ప్రజాస్వామ్యయుతంగా పాలించే వ్యక్తి కావాలా? హుజూరాబాద్ ప్రజలు ఆలోచించాలె’ అని సూచించారు. కేసీఆర్‌ను వెన్నుపోటు పోడవాలని చూసే నాయకుడు కావాలో? ప్రజల కోసం ఆలోచించే కేసీఆర్ కావాలో? నిర్ణయించుకోవాలన్నారు. బీజేపీ నాయకులకు దమ్ముంటే ఢిల్లీకి పోయి ప్రదాని మోదీ గడ్డమో, కాళ్లో పట్టుకొని దళితబంధు కోసం రూ.50వేల కోట్లు తేవాలని డిమాండ్ చేశారు. దళితబంధును ఆపేందుకు బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ‘బీజేపీ నాయకులు అన్నం పెట్టరు.. పెట్టేవారిని పెట్టనీయరు’ అని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నాయకుల తీరును దళితబిడ్డలు గమనిస్తున్నారన్నారు. మోదీది మాటల ప్రభుత్వమైతే కేసీఆర్‌ది చేతల ప్రభుత్వమని ఉదహరించారు. తెలంగాణ ప్రజల కోసం ఎల్లవేళలా ఆలోచించే కేసీఆర్‌వైపే ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశానికి పట్టిన దరిద్రం పోవాలంటే బీజేపీని ఓడించాలన్నారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ దళితబంధును ఆపేందుకు బీజేపీ నాయకులు కోర్టులో కేసులు వేసిండ్రని, వారు ఎన్ని కుట్రలు చేసినా పథకాన్ని ఆపేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రిలో స్ప ష్టం చేసి వెంటనే 76 కుటుంబాలకు దళితబంధు అందించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో అర్బన్ జడ్పీ అధ్యక్షుడు సుధీర్‌కుమార్, జడ్పీటీసీ కల్యాణి, వైస్ ఎంపీపీ శైలజ, సర్పంచ్ల ఫోరం కన్వీనర్ రవీందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ సంపత్‌రావు, మండల ఇన్చార్జి డాక్టర్ పేరియాల రవీందర్రావు, నాయకులు తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, పింగిళి ప్రదీప్‌రెడ్డి పాల్గొన్నారు.
టీఆర్ఎస్లోకి వలసలు
కమలాపూర్తోపాటు పలు గ్రామాలకు చెందిన పలువురు బీజేపీ కార్యకర్తలు సుమన్ ఆధ్వర్యంలో సోమవా రం టీఆర్ఎస్లో చేరారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ముఖ్యంగా దళితబంధు పథకానికి ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వివరించారు. మండల కేంద్రానికి చెందిన కొల్గూరి రాము, మరికొందరు టీఆర్ఎస్లో చేరగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాయకులు పుల్ల వినోద్‌కుమార్, న్యాయవాది మహేందర్, టీఆర్ఎస్వీ మండల కార్యదర్శి మహేశ్వర్, రవీందర్ తదితరులున్నారు.