అందరికీ అన్నం పెట్టే అన్నదాతను కాంగ్రెస్ ప్రభుత్వం అరిగోస పెడుతున్నది. కష్టపడి పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు తాత్సారం చేస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లను వారాలు గడిచినా కొనుగోలు చేయడం లేదు. వరి కోతల సీజన్ ముగుస్తున్నా సరిపడా కొనుగోలు కేంద్రాలను తెరవలేదు. కేంద్రాల్లో వడ్లు పోసి వారాలు గడుస్తున్నా కాంటాలు కావడం లేదు.
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు కొనుగోలు కేంద్రాల్లో వడ్లు బాగా తక్కువగా కొనుగోలు చేస్తుండడంతో మిల్లర్లు రైతుల వద్దకు వెళ్లి తక్కువ ధరకు వడ్లను కొనుగోలు చేస్తున్నారు. వడ్లకు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2,320 ఉంటే మిల్లర్లు మాత్రం రూ. 2,200 కంటే ఎక్కువ చెల్లించడం లేదు. పెట్టుబడి ఖర్చులు పెరిగి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులు ఇప్పుడు వడ్ల ధర తగ్గడంతో మరింత నష్టపోతున్నారు.
– వరంగల్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కలిపి వానాకాలంలో 9.02 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఆరు జిల్లాల్లో 12.25 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నిర్ణీత లక్ష్యంలో ఇప్పటివరకు పావు శాతం కూడా కొనుగోలు చేయలేదు. ఇప్పటికి 2.30 లక్షల టన్నుల వడ్లు కొన్నట్లు అధికారులు చెబుతున్నా వాస్తవంగా ఇంకా తక్కువే ఉన్నట్లు తెలిసింది. హనుమకొండ, జనగామ జిల్లాల్లో వరి కోతలు చివరి దశకు వచ్చాయి. వడ్ల కొనుగోలు కోసం ఆరు జిల్లాల్లో కలిపి 1,128 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా ఇప్పటికి 680 కేంద్రాలే ప్రారంభమయ్యాయి. వీటిలోని ఎక్కువ కేంద్రాల్లో వడ్లను కొనుగోలు చేయడం లేదు. సంచులు లేక కొనుగోలు వాయిదా పడుతున్నాయి. ఇవి ఎప్పటివరకు కొనుగోలు కేంద్రాలకు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొన్నది.
వానకాలం సీజన్లో సాగైన వరిలో 90 శాతం విస్తీర్ణంలో సన్నరకాలే ఉన్నాయి. అధిక వానలు, దోమ, తెగుళ్ల వల్ల పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది. వానకాలం వడ్ల కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించలేదు. వరి కోతలు మొదలైన తర్వాత వడ్ల కొనుగోలు విధానాన్ని ఖరారు చేసింది. సర్కారు నిబంధనలు, మిల్లర్ల షరతులతో కొనుగోళ్లు ఆలస్యమై రైతులు ఇబ్బంది పడుతున్నారు.
వానకాలం వడ్లకు కనీస మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వరి కోతలు మొదలైన తర్వాత మాట మార్చింది. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించింది. సన్న వడ్ల రకాలను ఖరారు చేయడంలోనూ ఆలస్యం చేసింది. ప్రభుత్వం ఇవన్నీ చేసేలోపే కోతలు మొదలయ్యాయి. సర్కారు కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, బోనస్‌పై సందేహాలతో చాలామంది రైతులు మిల్లర్లకు తక్కువ ధరకు వడ్లను అమ్ముకున్నారు. వరి రైతులకు ఇప్పటికీ ఇవే ఇబ్బందులు కొనసాగుతున్నాయి.