ఖిలావరంగల్/డోర్నకల్, జూలై 25 : కరోనా కారణంగా రద్దయిన పుష్పుల్ రైళ్లు మళ్లీ కూతపెట్టాయి. ప్యాసింజర్ రైళ్లను తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే బోర్డుకు పలుమార్లు విన్నవించడంతో సోమవారం వరంగల్-సికింద్రాబాద్, విజయవాడ-భద్రాచలం రోడ్ రైళ్లు మళ్లీ పట్టాలెక్కాయి. ఇందులో భాగంగా వరంగల్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే పుష్పుల్ రైలును సోమవారం నుంచి వరంగల్ ప్రజలకు అందుబాటు లోకి వచ్చింది.
నిత్యం వందలాది మంది వివిధ పనుల కోసం ప్యాసింజర్ రైళ్లలోనే ఎక్కువగా రాకపోకలు కొనసాగిస్తారు. పుష్పుల్ రైల్‌ను జడ్ఆర్యూసీసీ సభ్యులు జెండా ఊపి ప్రారంభిం చారు. త్వరలో కాకతీయ రైలు కూడా ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ రైల్వేస్టేషన్ మాస్టర్ శ్రీనివాస్, జడ్ఆర్యూసీసీ సభ్యుడు సునీల్ పాల్గొన్నారు. అలాగే విజయవాడ-భద్రాచలం రోడ్ మధ్య రైలు నెం(07979/07278) పుష్పుల్ ప్యాసింజర్‌ను రైల్వే అధికారులు సోమవారం ప్రారంభించారు. రైలు నెం 07979 విజయవాడలో ఉదయం 7.50 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12.50 గంటలకు భద్రాచలం రోడ్ చేరుతుంది. రైలు నెం.07278 భద్రాచలం రోడ్ నుంచి మధ్యాహ్నం 1.45 గంటలకు బయల్దేరి సాయంత్రం 6.55 గంటలకు విజయవాడ చేరుతుంది.