ముందొచ్చిన చెవులను వెనకొచ్చిన కొమ్ములు వెక్కిరించిన చందంగా ఉన్నది బీజేపీలో పరిస్థితి. కమలంలో కొత్తవారి పెత్తనంపై పార్టీ పాత నేతల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది. సమాచారం లేకుండా కొత్త నాయకుల పర్యటనలు, ఏకపక్ష నిర్ణయాలు సీనియర్లకు మింగుడుపడకుండా చేస్తున్నాయి. కష్టకాలంలో బీజేపీ కోసం పని చేసిన తమకు ప్రాధాన్యం దక్కడం లేదని, మొదటి నుంచీ పార్టీలో ఉన్నవారు, కొన్నేండ్ల క్రితం చేరిన వారిలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తున్నది. కనీసం సమాచారం కూడా లేకుండా ఇతర పార్టీల వారిని ఎలా చేర్చుకుంటారని సీనియర్లు భగ్గుమంటున్నారు. ఇలా కొత్త వర్సెస్ పాత అన్నట్లుగా సాగుతున్న వర్గపోరుతో కార్యకర్తల్లో అయోమయం నెలకొన్నది.
వరంగల్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) భారతీయ జనతా పార్టీలో రోజురోజుకూ గ్రూపుల లొల్లి ముదురుతున్నది. పార్టీలోని పాత నేతలకు, కొత్తగా చేరుతున్న వారికి మధ్య పంచాయతీలు పెరుగుతున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇటీవలి పరిణామాలతో కొత్త, పాత నేతల మధ్య దూరం ఇంకా పెరుగుతున్నది. వరంగల్ అర్బన్ సహకార బ్యాంకు చైర్మన్ ప్రదీప్‌రావు ఇటీవల బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.
వచ్చే వారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో చేరిక ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రదీప్‌రావు ఇంకా బీజేపీలో చేరకముందే పార్టీలోని పాత నేతలు అంసతృప్తితో రగిలిపోతున్నారు. ఆదినుంచీ పార్టీలో ఉన్న నేతలు, కొన్నేండ్ల క్రితం చేరిన వారు ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని సందిగ్ధంలో పడ్డారు. కష్టకాలంలో పార్టీ కోసం పని చేసిన తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇతర పార్టీల నేతలను ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
ప్రదీప్‌రావు చేరికపై కమలం పాత నేతలు తమ అసంతృప్తిని గట్టిగానే బయడపెడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్లిన ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపీలో చేరికల కమిటీ బాధ్యతలు చూస్తున్నారు. ఆయన ఇటీవల వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించడం అగ్గికి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా రావడమే కాకుండా ఇంకా పార్టీలో చేరని ప్రదీప్‌రావు ఇంటికి వెళ్లడంపైనా పాత నేతలు మండిపడుతున్నారు. ఈటలతో పాటు బీజేపీ ముఖ్యనేతలు పలువురు ప్రదీప్‌రావు ఇంటికి వెళ్లారు.
కాగా వరంగల్ తూర్పు ఇన్చార్జి కుసుమ సతీష్, కార్పొరేటర్ ఆడెపు స్వప్న, మరో కీలక నేత గంట రవికుమార్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ప్రదీప్‌రావు బీజేపీలో చేరిక ఏకపక్ష నిర్ణయమని వీరంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో బీజేపీ కోసం పని చేస్తున్న తమను లెక్క చేయకుండా ఈటల పర్యటన సాగిందని అంటున్నారు. బీజేపీ పటిష్టత కోసం ఇన్నేండ్లు పని చేసిన తమను పక్కనబెట్టి వేరే పార్టీ నుంచి వస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని తెగేసి చెబుతున్నారు.
బీజేపీలో తాజా పరిణామాలు ఆ పార్టీ పాత నేతలకు ఇబ్బందికరంగా ఉంటున్నాయి. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఇంట్లో జరిగిన స మావేశానికి హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి వంటి పొరుగు జిల్లాల నేతలు హాజరయ్యారు. వరంగల్ తూ ర్పులోని ముఖ్య నేతలను, సీనియర్లను మాత్రం పట్టించుకోలేదని పార్టీలోనే తీవ్ర చర్చ నడుస్తున్నది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాద యాత్ర కార్యక్ర మం నేపథ్యంలో గురువారం ఆ పార్టీ వరంగల్ జిల్లా పదాదికారుల సమావేశం జరిగింది. బీజేపీలోని పాత నేతలు ఈ సమావేశంలో తమ అసంతృప్తిని, అభ్యంతరాలను గట్టిగానే తెలిపారు. కార్యక్రమాల నిర్వహణపై పార్టీ ముఖ్యులకు సమాచారం ఉండడం లేదని, బీజేపీలో కొత్తగా చేరిన కొండేటి శ్రీధర్‌కు వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం వల్లే ఇలాంటి పరిస్థితి వస్తున్నదని బహిరంగంగానే చెప్పారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి పెత్తనం పెరుగుతున్నదని, ప్రదీప్‌రావు చేరిక గురించి కూడా తమకు చెప్పలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇదే పద్ధతి కొనసాగితే స హించేది లేదని, రాష్ట్ర స్థాయిలో మరోసారి ఫిర్యాదు చేస్తామని కరాఖండిగా చెప్పారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల వరంగల్ పర్యటనపైనా ఇదే తీరుగా స్పందించినట్లు తెలిసింది. బీజేపీ కార్యక్రమాలకు, పార్టీ ముఖ్యనేతల పర్యటనలకు స్థానిక నాయకులను ఆహ్వానించకపోవడం ఏమిటని నిలదీసినట్లు సమాచారం.
బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకత్వ తీరుతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే ఒక కార్పొరేటర్ పార్టీని వీడారని, పార్టీ నాయకులను సమన్వయం చేసే విషయంలో ఇలాగే కొనసాగితే మరి కొందరు దూరమవుతారని హెచ్చరించినట్ల తెలిసింది. వరంగల్ తూర్పులోని కొత్త, పాత నేతల మధ్య పంచాయతీలతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పర్యటన సమయంలోనే బీజేపీలో ఇలాంటి పరిణామాలు జరుగుతుండడంపై కాషాయ రాష్ట్ర నేతల్లో ఆందోళన పెరుగుతున్నది.