శాయంపేట, సెప్టెంబర్ 7 : సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగాలని టీఎస్ఐఐసీ చైర్మన్, వరంగల్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు అన్నారు. శాయంపేటలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్త్రృత స్థాయి సమావేశం గంగుల మనోహర్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముఖ్య అతిథిగా బాలమల్లు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి హాజరయ్యారు. ముందుగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం బాలమల్లు మాట్లాడుతూ రెండేళ్లకోసారి సభ్యత్వం, నాలుగేళ్లకోసారి పార్టీ కార్యవర్గాలను ఎన్నుకోవాలన్నారు. అన్ని గ్రామాల్లో పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు వేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మండలానికి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో అందరికీ కలుపుకుని చర్చించి సరైన వారికి అధ్యక్ష, కార్యదర్శి పదవులు ఇవ్వాలన్నారు. సీల్డ్ కవర్ సిస్టమ్ పార్టీలో లేదని, ఇకముందు కూడా ఉండదన్నారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారమే ఎన్నిక జరుగుతుందన్నారు. పోటీ ఉంటే ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షుడు వారిని సమన్వయ పరచాలన్నారు. ఎవరినీ కించపర్చకుండా వంద శాతం ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగాలన్నారు. ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దన్నారు. ఈ నెల 12 వరకు గ్రామకమిటీలు పూర్తి చేయాలన్నారు. 13 నుంచి 20 వరకు మండల కమిటీలు, పట్టణ కమిటీలు పూర్తికావాలన్నారు.
ఇవి పూర్తయితే జిల్లా కమిటీలు వేస్తామన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తనకు ఎలాంటి కోటరీలు లేవని, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానన్నారు. ఏ కార్యకర్తనూ దూరం చేసుకోనన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. ఆరు నెలల్లో మాందారిపేట నుంచి కటాక్షపూర్ వరకు డబుల్‌రోడ్డు, ఆత్మకూరు నుంచి శాయంపేట డబుల్‌రోడ్డు పూర్తి చేసి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. శాయంపేట అభివృద్ధి పూర్తి బాధ్యత జడ్పీ చైర్‌పర్సన్‌కు అప్పగిస్తామన్నారు. రెండు, మూడు నెలలకు ఒకసారి టీఆర్ఎస్ సమావేశాలు కచ్చితంగా నిర్వహిస్తామన్నారు. ప్రతి గ్రామంలో అందరి అభిప్రాయం మేరకే పార్టీ కమిటీ ఎన్నిక జరుగుతుందన్నారు. నియోజకవర్గ స్థాయిలో సోషల్ మీడియా టీమ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్రమశిక్షణతో పార్టీ బలోపేతానికి పనిచేయాలని కోరారు. త్వరలో సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి వస్తారన్నారు. వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ పండుగ వాతావరణంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లభిస్తుందన్నారు. విమర్శలను ఘాటుగా తిప్పికొట్టాలన్నారు. కాగా, మండలానికి చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు రూ.3.26లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గండ్ర దంపతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు కర్ర ఆదిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఏఎంసీ డైరక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.