నమస్తే నెట్వర్క్: జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలు ఇళ్ల ఎదుట దీపాలు వెలిగించి పటాకులు కాల్చి వేడుకలు చేసుకున్నారు. కేదారేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి వ్రతాలు చేశారు. వరంగల్ పెరుకవాడలోని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నివాసంలో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పటాకులు కాల్చారు. పిల్లలకు పటాకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు. ప్రతి ఇంట్లో వెలుగులు నిండాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలాగే, దుగ్గొండి మండలవ్యాప్తంగా దీపావళి వేడుకలను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. సంగెం మండలంలో నోములు ఉన్న వారు గురువారం రాత్రి కేదారేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పటాకులు కాల్చా రు. నర్సంపేట మండలంలో ఇంటింటా దీపావళి వేడుకలు జరిగాయి. వర్ధన్నపేట మండలంలో ప్రజలు భక్తితో కేదారీశ్వర నోమును ఆచరించారు. మహిళలు ఇంటి ఎదుట దీపాలు వెలిగించారు. యువకులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
పర్వతగిరి మండలంలోని అన్ని గ్రామాలు దీపాల వెలుగుల్లో శోభాయమానంగా కనిపించాయి. చెన్నారావుపేట మండలంలోని అన్ని గ్రామాలు దీపావళి సందర్భంగా కొత్త అల్లుళ్లు, బంధువుల రాకతో కళకళలాడాయి. నోములు ఉన్న వారు కేదారేశ్వరస్వామి వ్రతాన్ని ఆచరించారు. ఖానాపురం మండలంలో ప్రతి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలకేంద్రంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు-పద్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రాయపర్తి మండలంలోని 39 గ్రామాల్లో వేడుకలు జరిగాయి. ప్రజలు తమ ఇండ్లకు రంగులు వేయించి వాకిళ్లు, లోగిళ్లు, ముంగిళ్లలో కల్లాపి చల్లుకుని రంగురంగుల ముగ్గులు వేసి, గుమ్మాలను బంతి పూల దండలతో అందంగా అలంకరించుకున్నారు. సాయంత్రం వేళ ఇంటి ఎదుట దీపాలు వెలిగించి పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. గీసుగొండ మండలంలోతోపాటు గ్రేటర్ వరంగల్ 15, 16వ డివిజన్లలో దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు.
కేసీఆర్, కేటీఆర్ కట్ఔట్లతో వేడుకలు
వరంగల్ చౌరస్తా: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కట్ఔట్లను విద్యుత్ దీపాలతో అలంకరించి, దీపావళి వేడుకలు నిర్వహించిన టీఆర్ఎస్ నాయకుడు రాజనాల శ్రీహరి తన అభిమానాన్ని చాటుకున్నారు. గురువారం రాత్రి వరంగల్చౌరస్తాలోని తన నివాసంలో పూజా కార్యక్రమం అనంతరం దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తూ వెలిగిపోతుందని కొనియాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హయాంలోనే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతున్నదన్నారు.