కరీమాబాద్, అక్టోబర్ 11: అందరి సహకారంతోనే ఉర్సు రంగలీలా మైదానంలో ఏటా దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్‌బాబు అన్నారు. కరీమాబాద్‌లోని ఆదర్శ కల్యాణ మండపంలో ఉత్సవ కమిటీ కన్వీనర్ వొడ్నాల నరేందర్ అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు నాగపూరి సంజయ్‌బాబు, బండి కుమారస్వామి మాట్లాడుతూ ఈ నెల 15న ఉర్సు రంగలీలా మైదానంలో రావణవధ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున వేడుకను నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రత్యేక పటాకులతో కనువిందు చేయనున్నట్లు వెల్లడించారు.
గ్రేటర్ కార్పొరేషన్ ఏర్పాట్లు
మహా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారని సంజయ్‌బాబు, కుమారస్వామి అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సవాలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు. వేడుకలో సాంస్కృతిక కార్యక్రమాలు సైతం చేపడుతున్నామన్నారు. ఉత్సవాలకు సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, దాతలు, ఉత్సవ కమిటీ సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కోశాధికారి మండ వెంకన్నగౌడ్ మాట్లాడుతూ దాదాపు రూ. 10 లక్షలతో పటాకులు కాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కన్వీనర్ వొడ్నాల నరేందర్ మాట్లాడుతూ 75 అడుగుల భారీ రావణ ప్రతిమను ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు వంగరి కోటేశ్వర్, వెలిదె శివమూర్తి, కార్య నిర్వాహక కార్యదర్శులు గోనె రాంప్రసాద్, వంచనగిరి సమ్మయ్య, వొగిలిశెట్టి అనిల్‌కుమార్, దామెరకొండ వెంకటేశ్వర్లు, నాగపూరి రంజిత్, పొగాకు సందీప్, కార్యదర్శులు బజ్జూరి వాసు, సుంకరి సంజీవ్, బొల్లం రాజు, ఎనగందుల సుధాకర్, పూదరి అజయ్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.