శనివారం 27 ఫిబ్రవరి 2021
Warangal-city - Feb 09, 2021 , 01:12:59

పశ్చిమ బెంగాల్‌కు వరంగల్‌ పసుపు

పశ్చిమ బెంగాల్‌కు వరంగల్‌ పసుపు

  • పట్టాలెక్కిన తొలి రైలు
  • పది వ్యాగన్లలో 2,036 టన్నుల ఎగుమతి
  • చార్జీల్లో రాయితీ ఇస్తుండడంతో ముందుకొస్తున్న రైతులు, వ్యాపారులు
  • పట్టాలెక్కిన తొలి రైలు   
  • పది వ్యాగన్లలో 2,036 టన్నుల ఎగుమతి
  • చార్జీల్లో రాయితీ ఇస్తుండడంతో ముందుకొస్తున్న రైతులు, వ్యాపారులు

ఖిలావరంగల్‌, ఫిబ్రవరి 8 : దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజన్‌లో తొలి పసుపు రైలు వరంగల్‌లో పట్టాలెక్కింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి మిర్చి, ఎఫ్‌సీఐ ద్వారా లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం గూడ్స్‌ రైళ్లలో దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. ఇప్పుడు కిసాన్‌ రైలు ద్వారా పసుపు కూడా రవాణా చేస్తున్నారు. ఈమేరకు సోమవారం వరంగల్‌ రైల్వే గూడ్స్‌ షెడ్డు నుంచి కిసాన్‌ రైలులో పది జంబో వ్యాగన్లలో 2036 టన్నుల పసుపును పశ్చిమబెంగాల్‌లోని బారాసాట్‌కు ఎగుమతి చేశారు. ఈ రైలును సికింద్రాబాద్‌ ఏసీఎం విద్యాధర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల డిమాండ్‌ మేరకు వరంగల్‌ రైల్వే గూడ్సు షెడ్డు కేంద్రంగా ఇతర రాష్ర్టాలకు తరలించేందుకు దక్షిణమధ్య రైల్వే సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న చార్జీల్లో 50శాతం రాయితీ ఇస్తున్నామన్నారు. రైతులు, వ్యాపారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలోని పసుపు, ఇతర పంటలు పండించే రైతుల వద్దకు వెళ్లి రవాణా వ్యవస్థ, రాయితీలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులు తాము పండించిన పంటకు ఎక్కడైతే ధర ఎక్కువగా ఉంటుందో అక్కడ విక్రయాలు కొనసాగించేందుకు కిసాన్‌ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రోడ్డు మార్గంలో అయితే సమయంతో పాటు ఖర్చు కూడా ఎక్కువవుతుండడంతో కిసాన్‌ రైలులో చేరవేస్తున్నారు. రైల్వే చార్జీల్లో 50శాతం రాయితీ ఇస్తుండడంతో ఉమ్మడి జిల్లాలోని పసుపు రైతులు, వ్యాపారులు ఎగుమతి చేసేందుకు ముందుకొస్తున్నారు. కార్యక్రమంలో డివిజనల్‌ సీనియర్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటసుబ్రహ్మణ్యం, స్టేషన్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌, సీసీఐ శ్రీనివాస్‌, గూడ్సు సూపర్‌వైజర్‌ సజ్జన్‌లాల్‌, పార్సిల్‌ సూపర్‌వైజర్‌ సుబ్రమణ్యం, సీబీఎస్‌ఆర్‌ రామారావు, సీటై వెంకటేశ్వర్లు, ఏసీఎం అసిస్టెంట్‌ పృథ్వీరాజ్‌, హుండేకర్‌ బండారి దేవేందర్‌ పాల్గొన్నారు.


VIDEOS

logo