శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-city - Jun 07, 2020 , 01:32:22

మాణిక్యాపూర్‌లో విప్లవ సాహిత్య పుస్తకాలు

మాణిక్యాపూర్‌లో విప్లవ సాహిత్య పుస్తకాలు

  • ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

 భీమదేవరపల్లి, జూన్‌ 06: కార్డన్‌సెర్చ్‌లో భాగంగా సోదాలు చేస్తుండగా విప్లవ సాహిత్య పుస్తకాలు దొరకడంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌లో శనివారం సుమారు 70మంది పోలీసులు తనిఖీలు చేశారు. తెలంగాణ ప్రజాఫ్రంట్‌ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు గొల్లూరి ప్రవీణ్‌కుమార్‌, సభ్యుడు ఉగ్గె శేఖర్‌, మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు ఉగ్గె చంద్రమౌళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కమలాపూర్‌ మండలం కనిపర్తికి చెందిన టీపీఎఫ్‌ సభ్యుడు కొత్తూరి ఇంద్రసేనను సైతం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గొల్లూరి ప్రవీణ్‌కుమార్‌, కొత్తూరి ఇంద్రసేన ఇంటిలో సోదాలు చేయగా విప్లవ సాహిత్య పుస్తకాలు దొరికినట్లు తెలిసింది. దీంతో వంగర ఠాణాలో కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్‌, ఓఎస్డీ తిరుపతి, ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్‌జీ, ఎస్‌ఐలు టీవీఆర్‌ సూరి, గంజి స్వప్న, సూర్యప్రకాశ్‌, మరో ఆరుగురు ఎస్సైలు కలిసి వీరిని రహస్యంగా విచారించినట్లు తెలిసింది. అనంతరం మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు ఉగ్గె చంద్రమౌళిని వదిలిపెట్టి మిగిలిన టీపీఎఫ్‌ సభ్యులు గొల్లూరి ప్రవీణ్‌కుమార్‌, ఉగ్గె శేఖర్‌, కొత్తూరి ఇంద్రసేనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలను ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడిస్తామని ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్‌జీ పేర్కొన్నారు.