శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Warangal-city - Jan 27, 2020 ,

అంబరాన్ని తాకిన సంబురాలు

 అంబరాన్ని తాకిన సంబురాలు

అర్బన్‌ కలెక్టరేట్‌, జనవరి 26: హన్మకొండ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేసిన ఏర్పాట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉదయం 9గంటలకు కలెక్టర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల అలంకరణ శకటంపై నుంచి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రసంగించారు. వేడుకల సందర్భంగా సుమారు 61 మంది స్వాతంత్య్ర సమరయోధులను కలెక్టర్‌తోపాటు పలువురు సత్కరించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. అనంతరం అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో  ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై ప్రదర్శన ద్వారా వివరించారు. అలాగే వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు, సోషల్‌ వర్కర్లు, ఆర్టీసీ కార్మికులు, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి కలెక్టర్‌ ప్రశంసాప్రతాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పల్లె ప్రగతిలో భాగంగా ప్రగతి సాధించిన ఫొటోలపై కలెక్టర్‌ పీజేపాటిల్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.  చాయ చిత్ర ప్రదర్శనలను కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌, పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌, స్పెషల్‌ కలెక్టర్‌ మనుచౌదరి, వివిధ శాఖలకు చెందిన అధికారులు తిలకించారు. 


ఆకట్టుకున్న స్టాల్స్‌

పరేడ్‌ గ్రౌండ్‌లో వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ చూపరులను ఆకట్టుకున్నాయి. వ్యవసాయం, పశుసంవర్థక, మహిళా శిశు సంక్షేమ శాఖ, మిషన్‌భగీరథ, బీసీ సంక్షేమ శాఖ, మెప్మా, డీఆర్డీఏ,మత్స్యశాఖ, వైద్యారోగ్య శాఖ, రెడ్‌క్రాస్‌ సంస్థ  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను  కలెక్టర్‌ పరిశీలించారు.  


రూ.30 లక్షల ఆస్తుల పంపిణీ

జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా సుమారు రూ.30 లక్షలు విలువ చేసే ఆర్థిక సహాయాన్ని ఐదుగురు లబ్ధిదారులకు అందజేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న 10 జంటలకు ఎస్సీ అభివృద్ధి సంస్థ ద్వారా ఒక్కొక్కరికి రూ.50వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే బేటి బచావో-బేటి పడావో పథకం ద్వారా 20 మంది ఇంటర్‌ విద్యార్థుల్లో ఇద్దరికి  రూ. 5వేల చొప్పున, 20 మందికి ప్రోత్సాహక ఆర్థిక సాయం అందజేశారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా స్వయం ఉపాధి పథకం కోసం రూ.21లక్షల నగదు ఏడుగురికి అందజేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.  


 విద్యార్థులకు ప్రశంసాపత్రాలు

పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థుల వద్దకు వెళ్లిన కలెక్టర్‌ వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. వాఖ్యాతగా వ్యవహరించిన ముగ్ధుంను శాలువాతో సన్మానించారు. వేడుకల్లో ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వీ రవీందర్‌, గ్రేటర్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, జేసీ ఎస్‌ దయానంద్‌, స్పెషల్‌ కలెక్టర ఎం మనుచౌదరి, డీఆర్వో పీ మోహన్‌లాల్‌, వరంగల్‌ ఆర్డీవో కే వెంకారెడ్డి, జెడ్పీ సీఈవో ప్రసూనారాణి, ఎస్సీ సంక్షేమాధికారి మాధవిలత, డీఈవో కే నారాయణరెడ్డి, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ నిర్మల, బీసీ వెల్ఫేర్‌ అధికారి  ఆర్‌ వసంతం, జిల్లా సంక్షేమాధికారి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  


ఆకట్టుకున్న పరేడ్‌

వరంగల్‌ క్రైం: పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకల సందర్భంగా   ఏఆర్‌ పోలీసుల ఆధ్వర్యంలో చేసిన పరేడ్‌ అందరినీ ఆకట్టుకుంది. ఆర్‌ఐ శ్రీనివాస్‌ పరేడ్‌ బృందానికి కమాండర్‌గా వ్యహరించగా 105 మంది పోలీస్‌ సిబ్బంది పరేడ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 


logo