శనివారం 28 నవంబర్ 2020
Wanaparthy - Aug 14, 2020 , 04:06:46

ఆత్మకూరు యువకుడికి అరుదైన అవకాశం

ఆత్మకూరు యువకుడికి అరుదైన అవకాశం

  • l పంద్రాగస్టు వేడుకల్లో క్యాలీగ్రఫీ కళ
  • l 15 భాషల్లో జాతీయగీతం ప్రచురణ
  • l తెలుగు భాషకు సంబంధించి రాష్ట్రం నుంచి  ఆత్మకూరు యువకుడికి అవకాశం

ఆత్మకూరు: ఆత్మకూరు పట్టణానికి చెందిన యువకుడికి అరుదైన అవకాశం లభించింది. ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకల్లో అరుదైన క్యాలిగ్రఫీ కళతో జాతీయగీతానికి నివాళి అర్పించనుంది. 15 మంది క్యాలిగ్రఫీ కళాకారులు 15 మంది గాయకులతో దేశ ఐక్యతను చాటేలా జాతీయగీతానికి క్యాలీగ్రఫీ కళను అంకితం చేయనున్నారు. ‘అక్షరభారత్‌' పేరిట కరోనా కష్టకాలంలో దేశానికి నివాళి అర్పించనున్నారు. ముంబైకి చెందిన వీఎస్‌కేఏ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ గేయాలాపన 15 భాషల్లో ఆలపించనున్నారు. దేవగిరి, ఒడియా, తెలుగు, కన్నడ, మలయాలం, గుజరాతి, ఉర్దూ, తమిళ్‌, గురుముఖి, మోది, కశ్మీరి, బెంగాలి, అస్సామి, మరాఠీ, సిద్దాం భాషల అక్షరమాలతో జాతీయగీతాన్ని ప్రచురణతో పాటు ఆయా భాషలలో ఆలపించనున్నారు. వైవిధ్య భారత్‌ ఐక్యతను చాటేందుకు చేపడుతున్న ఈ వీడియో గేయం నేడు సాయంత్రం విడుదల కానుంది. జాతీయగీతాన్ని 15 మంది క్యాలీగ్రఫీ కళాకారులతో 15 భాషల్లో ప్రచురిస్తుండగా తెలుగు నుంచి తెలంగాణకు చెందిన వనపర్తి జిల్లా ఆత్మకూరు యువకుడికి అవకాశం దక్కింది. ఆత్మకూరు మాజీ సర్పంచ్‌ కట్టెలమండి రాములు కుమారుడు కార్డి నవకాంత్‌కు ఈ అరుదైన అవకాశం లభించింది. నవకాంత్‌ క్యాలీగ్రఫీ కళలో ఇప్పటికే అనేక అంతర్జాతీయ వేదికలపై తన ప్రతిభను చాటుకున్నాడు. తాజాగా దేశ సమైఖ్యతను చాటే కార్యక్రమంలో జాతీయస్థాయిలో తెలుగు లిపి ప్రచురణకర్తగా నవకాంత్‌కు అవకాశం వచ్చింది. జాతీయగీతంలో ‘తవ శుభ ఆశిష మాగే’ అనే వరుసను తెలుగులో ప్రచురించనున్నారు. 15 వరుసలను 15 భాషల లిపిని వినియోగిస్తూ క్యాలీగ్రఫీ కళాకారులతో ప్రచురిస్తూ చేస్తున్న కార్యక్రమంలో తెలుగు నుంచి మన తెలంగాణ యువకుడికి అవకాశం దక్కడం హర్షణీయం.