బెంగళూరు, మే 1: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాన నిందితుడు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, రెండో నిందితుడు ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణలకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమన్లు జారీచేసింది. 24 గంటల్లోగా ఎస్పీ సీమా లాట్కార్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. కాగా, తనపై వస్తున్న ఆరోపణలపై ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తొలిసారి స్పందించాడు. త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించాడు. ‘సిట్ ముందు హాజరుకావడానికి 7 రోజుల సమయం కావాలి. ఇప్పుడు నేను బెంగళూరులో లేను’ అంటూ ‘ఎక్స్’లో సందేశాన్ని పోస్ట్ చేశాడు. సెక్స్ స్కాండల్ వెలుగులోకి వచ్చిన కొద్ది గంటల్లోనే ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ఉపయోగించి ఏప్రిల్ 28న జర్మనీ పారిపోవటం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. అతడి పాస్‌పోర్ట్ రద్దు చేసి, ప్రజ్వల్‌ను భారత్‌కు రప్పించటంలో సాయం చేయాలని ప్రధాని మోదీని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కోరారు.
పలువురు మహిళలపై ఎంపీ ప్రజ్వల్ లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంగతి ప్రధాని మోదీకి ముందే తెలుసునని, అయినా ప్రజ్వల్ గురించి గొప్పగా చెబుతూ, అతడికి ఓటేయాలని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఓటర్లను కోరారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేథ్ తప్పుబట్టారు. ‘మోదీ పరివార్’లో భాగమని ఎంపీ ప్రజ్వల్ చెప్పుకుంటున్న సోషల్ మీడియా ప్రొఫైల్‌ను ఆమె బుధవారం మీడియాకు చూపారు. ‘ఎంపీ ప్రజ్వల్‌పై లైంగిక నేరాలు, అతడు ఎలాంటి వాడన్నది బీజేపీ నాయకుడు దేవరాజే గౌడ 2023 డిసెంబర్లోనే బయటపెట్టారు. అతడ్ని కూటమి అభ్యర్థిగా నిలబెట్టవద్దంటూ ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు మెయిల్స్, లేఖలు పంపాడు’ అని ఆమె అన్నారు. అయితే లైంగిక వేధింపుల గురించి తమ పార్టీ నేత తనకు లేఖ రాశాడన్న ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర ఖండించారు.