– దానం విజయమ్మ, చేర్యాల
మీరు మీ ఇల్లు కడుతున్నారు కదా. పక్కింటి లెక్కలు మీకెందుకు? మీ స్థలం, మీ వీధి.. ఇవే ప్రధానం. మీ ఇంటి స్థలం, దాని రోడ్డు వెడల్పును బట్టి ఇంటి ఎత్తును పెంచాలి. ముఖ్యంగా ఇంటినుంచి వాహనాలు రోడ్డుమీదికి రావడానికి ర్యాంపు అవసరం అవుతుంది. అది రోడ్డును ఆక్రమించకుండా కుదుర్చుకోవాలి. ఇంటి ఫ్లోరింగ్ ఎత్తు పెంచకుండా సీసీ రోడ్డు ఉంటే.. దానినుంచి మూడున్నర అడుగుల ఎత్తు ఉండాలి. అందులో కాంపౌండ్ నుంచి రోడ్డు మీదికి ఒకటిన్నర అడుగు ఎత్తు అనుకూలంగా ఉంటుంది. కచ్చారోడ్డు ఉంటే ఈ కొలతకు ఒక అడుగు పెంచుకోవాలి. అంతేకానీ, పక్కింటిని బట్టి ఎత్తు పెంచుకోవాలని అస్సలు అనుకోకూడదు. అలా అందరూ పెంచుకుంటూ పోతే.. చివరి ఇల్లు మీ అందరికంటే ఎత్తులో ఉంటుంది మరీ. ఇంటికి ప్రధానం మన ఎదురు వీధి. అదే అన్నిటినీ కుదిరిస్తుంది. తెలుసుకొని కట్టండి.
– బాల్కొండ శివ, బీబీనగర్
వెడల్పు తక్కువ ఉండి లోతు ఎక్కువగా ఉండే స్థలాలకు గేటు చిన్నగా పెడితే రోడ్డు దిక్కు ఇరవై అడుగులు ఉంటుంది. కాబట్టి, గేటులోంచి వాహనాల రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. మీరు కింద దక్షిణంలో ఏ గది కట్టకుండా.. దక్షిణ నైరుతిలో నాలుగు అడుగుల గోడకట్టి మిగతా భాగమంతా గేటు పెట్టుకోండి. అప్పుడు గేటు దాదాపు పద్నాలుగు అడుగులు వస్తుంది. అలా ఉన్నదాంట్లో నైరుతి మూసి, గేటు ఏర్పాటు చేసుకోండి. ముఖ్యంగా రోడ్డు ఎంత వెడల్పు ఉందో మీరు చెప్పలేదు. వీధి చిన్నది అయితే ర్యాంపు లోపలికి తీసుకొని రోడ్డు మీద చొచ్చుకొని రాకుండా.. స్థలంలోకి జరిగి అనుకూలమైన ర్యాంపు నిర్మించుకోండి. కింద మొత్తం ఖాళీ వదిలినప్పుడే ఇలాంటి స్థలాల్లో అనుకున్న గేటును పెట్టుకోవచ్చు.
– ఎస్. భారతి, నార్కెట్‌పల్లి
మీరు చెబుతున్న బాల్కనీ ఎలా వస్తుంది? ఏ చోట వస్తుంది? అనేది చూసుకోవాలి. ఈశాన్యం ఓపెన్‌గా ఉంచి అటు దిక్కుకే బాల్కనీ ఉండాలని.. దానికి ఉనికి లేకుండా చేస్తున్నారు. ఇంటికి తూర్పు-ఉత్తరం మొత్తం దిక్కుల్లో ఇంటి వెడల్పు ఎంత ఉంటే అంత బాల్కనీ రావాలి. అట్లాగే దక్షిణం-పడమర వైపు కూడా బాల్కనీ ఇచ్చుకోచ్చు. అలా నాలుగు వైపులా ఇచ్చుకోవడం చాలా గొప్పవిధానం.

నేడు ఇల్లు సరిపోదని బాల్కనీలు వదిలి ఇంటి మూలలను కట్ చేసి.. అదే బాల్కనీ అంటున్నారు. ఇది ఎలా ఉందంటే నా జేబులో డబ్బు తీసి నా చేతిలోనే పెట్టి.. ‘నీకు డబ్బులిస్తున్నాను. జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో’ అన్నట్లు ఉంది. మీకు ఎటు కావాలంటే అటుకాకుండా.. ఒకవైపు మాత్రమే అనుకుంటే తూర్పు-ఈశాన్యం ఇల్లు దాటిన బాల్కనీ వేసుకోవాలి. దాన్ని హ్యాంగింగ్ బాల్కనీ అని కూడా అంటారు. అంతేకానీ ఇంటి మూలను కట్ చేసి వేయకూడదు. అది దోషమవుతుంది.
– బెట్టు సాయిలు, జీడికల్
ఒకప్పుడు గుంత తీసి దానిమీద ఒక పెద్ద బండ వేసి దానికి రంధ్రం పెట్టి లెట్రిన్గా వాడేవాళ్లు. అది చాలా అనారోగ్య సమస్యలకు కారణమయ్యేది. గదికి దూరంగా టాయిలెట్ ఉండాలి. సెప్టిక్‌ట్యాంక్ అనేది వేరుగా ఉన్నప్పుడే బ్యాక్టీరియా, ఇతర కీటకాలు మనకు దూరంగా ఉంటాయి.

చాలా గ్రామాల్లో ఇప్పటికీ సరైన పద్ధతిలో మరుగుదొడ్లు నిర్మించుకోకపోవడం వల్ల అనేక రోగాలతో బాధపడుతున్నారు. మీరు సెప్టిక్ ట్యాంకును తూర్పు, ఉత్తరం దిక్కుల మధ్యలో కట్టుకోండి. టాయిలెట్ గదులను ఇంటికి అంటకుండా వాయవ్యం, ఆగ్నేయాలలో నిర్మించుకొని శుభ్రంగా వాడుకోండి. ఇంటి పరిసరాలకు దూరంగా గుంతను నిర్మించి వాడుకోవచ్చు. ఆరోగ్యమే ప్రధానమని ఇంటి శాస్త్రం చెబుతుంది.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143