– వి. సాయిరామ్, భువనగిరి.
ఇంటి బయట వేరు. ఇంటి లోపల వేరు. ఇంటిలో మెట్లు, లిఫ్ట్ పెట్టుకోవాలి అంటే.. నైరుతి, ఈశాన్యం మూలలు పనికిరావు. గృహంలో అయినా, వ్యాపార స్థలంలో అయినా.. లోపలిభాగంలో దక్షిణం మధ్యలో కానీ, పడమర మధ్యలోకానీ మెట్లు, వాటి మధ్య లిఫ్టు రావాలి. లేదా మెట్ల పక్కన లిఫ్ట్.. ఇలా విడివిడిగానైనా పెట్టుకోవచ్చు. నైరుతి భాగం ఇంటిలో చాలా ప్రధాన శక్తి స్థలం.
దానిని యజమాని వాడుకోవాలి. అప్పుడు అతనికి పూర్ణ శక్తి లభిస్తుంది. అలాగే, ఈశాన్యంలో కూడా పనికి రావు. కారణం.. ఇంటిలోకి వచ్చే సూర్య శక్తికి అడ్డుపడతాయి. ప్రధాన సింహద్వారం మూతపడుతుంది. కొందరు ‘నైరుతిలో పెడితే మాకు కలిసి వస్తుంది’ అనుకుంటారు. కుడి చేత్తో తిన్నా.. ఎడమ చేత్తో తిన్నా.. అన్నం కడుపులోకే చేరుతుంది. కానీ, శాస్త్రం దేనిని ఆమోదించిందో.. దానినే ఆచరించాలి.
– కె. శరత్-శశాంక్, ధర్మపురి.
కవలలుగా పుట్టినంత మాత్రాన అభిరుచులు ఒకేలా ఉండాలనే నియమం లేదు. మీ ఇష్టానుసారం మీ ఇండ్లు కట్టుకోవచ్చు. మీమీ కుటుంబసభ్యులు విభిన్నమైన ఆలోచనలతో ఉండవచ్చు. రూపం ఒకేలా ఉన్నంత మాత్రాన.. జన్మ గతాలు ఒకేలా ఉండవు. ఎవరి స్వభావ కర్మలు వారివికదా! ఒక స్థలంలో మీరు ఇండ్లు కట్టుకున్నా.. ఎవరి కాంపౌండు వారు సపరేటుగానే పెట్టుకొని కట్టండి.
మీ ఇద్దరిలో ఎవరు ముందు పుడితే వారు (కొన్ని నిమిషాలు అయినా సరే) దక్షిణ భాగంలో అంటే.. తూర్పు రోడ్డు స్థలం అయితే దక్షిణంలో, ఉత్తరం రోడ్డు అయితే పడమర భాగంలో పెద్దవారు ఇల్లు కట్టుకోవాలి. ఒకే విధంగా అనేమీ లేదు. ఎవరు ఎంత పెద్దదైనా, చిన్నదైనా ఇల్లు కట్టుకోవచ్చు. ఎలివేషన్ కూడా మీ ఇష్టం. అయితే, శాస్త్రబద్ధంగానే మీ ఇండ్లు కట్టుకోవాలి. అదే మీ పిల్లలకు శుభదాయకం.
ఇంటిని ఏదో ఒక మూల కట్ చేయాలి అనేది శాస్త్ర నియమం కాదు. అసలు ఏ మూలను కూడా కట్ చేయకూడదు. కారు పార్కింగ్ అనేది ఇంటికి ఉత్తర స్థలంలో కానీ, తూర్పు స్థలంలో కానీ ఉండొచ్చు. ఆ పార్కింగ్ కోసం తూర్పు ఆగ్నేయంలో లేదా ఉత్తర వాయవ్యంలో ఇంటికి కాంపౌండును అంటకుండా షెడ్డు వేసుకొని, అందులో కారు పార్క్ చేసుకోవచ్చు.
ఇంటి భాగాన్ని వదిలి తూర్పులో ఎక్కువ ఖాళీ ఇచ్చినప్పుడు అది అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే, ఉత్తరం భాగాన్ని కూడా ఎక్కువ వదలగలిగితే.. అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇల్లు నలు చదరంగా లేదా దీర్ఘ చతురస్రంగా నిర్మించినప్పుడే అది సంపూర్ణ బలంతో నిలబడగలుగుతుంది. ఈ కటింగులు, పార్కింగులు మధ్యలో వచ్చినవే! అవి శాస్త్రం కాదు.
– కె. సరస్వతి, బైరాన్పల్లి.
ఇది చాలా సూక్ష్మ అంశాలతో కూడిన ప్రధాన విషయం. మన నివాసం ప్రకృతి శక్తులతో నిండినప్పుడే అది ‘శాంతి ధామం’ అవుతుంది. ఉత్తరం వైపుసాగని రోడ్డు ఉన్న పడమర ఇల్లు, తూర్పు వైపు నడవని రోడ్డు ఉన్న ఉత్తరం ఇల్లు.. కుటుంబ వృద్ధికి అంతగా విస్తృత ఫలితాలను ఇవ్వలేవు. అంటే పెద్ద సిమెంటు తొట్టిలో మామిడి చెట్టు పెంచినట్టు. ప్రాణంతో ఉంటుంది.
పండ్లు ఇస్తుంది. కానీ, నేలమీద ఉన్న మామిడి వృక్షంతో అది ఎన్నటికీ సమానంగా ఉండలేదు కదా! అలా కుటుంబ వికాసంలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఇక దక్షిణం సాగని రోడ్డు ఉన్న తూర్పు గృహం, పడమరకు పోని రోడ్డు ఉన్న ఉత్తరం ఇండ్లు.. అవి డెడ్ ఎండ్ రోడ్లు అనిపించినా.. ఆ గృహాలు ఎంతో మంచివి. వాటిలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. గృహం.. ప్రకృతి ప్రసాదం. దానిని అన్ని రకాలుగా చూసి కట్టుకోవాలి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143