– వి. సోమశేఖర్, ఆమనగల్లు.
రెండు ఇండ్లు కట్టడం ఎందుకు? ఒకే ఇంట్లో మీతోపాటుగా అమ్మానాన్నలనూ ఉండనివ్వండి. స్థలం ఒకటే అయినప్పుడు అది మీ కుటుంబానికే చెందుతుంది కదా! అమ్మానాన్నలు ఎందుకు వేరుగా ఉండాలి? వాళ్లు కన్నవాళ్లు కదా! వేరు చేయాల్సిన అసరం దేనికి? మీరు కట్టుకునే పెద్ద ఇంట్లో అమ్మానాన్నలకు గది ఎక్కడ అనేదే ముఖ్యం అవుతుంది. అంతేకానీ, రెండు ఇండ్లు వద్దు. కన్నవాళ్లే కాదు.. రేపు మనంకూడా వృద్ధులం అవుతాం కదా! అసలు సమాధానం రాయకుండా ఇవన్నీ ఎందుకు? అనిపిస్తుండవచ్చు మీకు.
కానీ, కట్టుకున్న వారిని, కని పెంచినవారిని ఏదోవిధంగా దూరంచేస్తూ.. సర్దుబాటు లేని వ్యక్తులను శాస్త్రం ఎలా అంగీకరిస్తుంది అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సి ఉంటుంది. శాస్త్ర హృదయం వ్యాపార దృష్టితో ఉండదు. నిజాయతీగల హృదయంవైపు ఉంటుంది. ధర్మాచరణ, దాని విశిష్టత, వ్యక్తిత్వం లేకుండా శాస్త్రం ఉపకరించదు. ఇది కాస్త కఠినంగా అనిపించినా.. ఇదే సత్యం. చాలామందికి అర్థంకాని అంశం ఇదే. శాస్త్రం ఒక కారు (యంత్రం) కాదు. దొంగనైనా.. సాధువునైనా ఒకేలాగా మోసుకుపోవడానికి. మనుషులు సర్దుకుపోతారేమో.. శాస్త్రం సర్దుకుపోదు.
దయచేసి అర్థం చేసుకోండి. అమ్మానాన్నలకు నైరుతిలో మంచి వసతులతో బెడ్రూము కట్టి.. వారిని అందులో ఉంచండి. అంతకన్నా పెద్ద బలం లేదు. మీరు పైన మాస్టర్ బైడ్రూమును నైరుతిలో వేసుకోండి. ఒకేచోట డూప్లెక్స్ ఇల్లు కట్టుకొని ఉండండి. రెండు ఇండ్లు కట్టే బదులు డూప్లెక్స్గా మంచి భవనం కట్టి, వారి ఔదార్యాన్ని, ఆశీర్వాదాన్ని అందుకోండి. మీకూ, మీ పిల్లలకూ ఉత్తమ భవిష్యత్తు అందుతుంది. అదే శాస్త్ర సమ్మతం. పెద్దలకు ఆమోదితం.
– కె. సావిత్రి, కమ్మర్పల్లి.
అవును! ఇల్లు ఒక్కటేకానీ, దానికి దశ దిశలు ఉంటాయి కదా! ఒక్కో దిశ ఒక్కో స్వభావం కలిగి ఉంటుంది.
అలాగే, ఒక్కో మూలలో ఉండే వక్రత ఆయా మూలల ప్రభావాలు స్త్రీ – పురుషుల మీద సమానంగా ఉండవు. ఇంటి యజమానులు కాకుండా.. కేవలం పిల్లల మీద కూడా ఇబ్బందులు కలిగించవచ్చు. తూర్పుభాగం పురుషుల మీద, దక్షిణం స్త్రీల మీద, ఈశాన్యం పిల్లలపైన.. ఇలా వాటివాటి నిర్మాణ వక్రతలనుబట్టి సమస్యలు, వాటి ఫలితాలు మనకు కనిపిస్తాయి. అలాగే ఇంటి మొత్తంమీద వీధిపోట్ల ఫలితం కూడా తీవ్రంగానే ఉంటుంది. ఒంటిలోకి ఒక రోగం చేరితే చర్మం మీద మచ్చలు రావచ్చు. కానీ, కళ్లు బాగుంటాయి. గుండె బాగుంటుంది. ఇలా.. ఒక్కో దిశ ఆ దిశకు ఉన్న అధిష్ఠాన దేవత ఆయా ప్రభావాలు కలిగిస్తుంది.
ఇల్లు విభిన్న శక్తుల నిలయం. దాని విస్తృతి నిగూఢంగా ఉంటుంది. మన అవగాహనకు అందదు. అందుకే, వేల సంవత్సరాల ఈ శాస్త్ర అవగాహన కేవలం భౌతిక దృష్టితో చూస్తే అర్థంకాదు. తాత్విక దృష్టితో చూడాలి. మన కంటిరెప్ప కదలిక మనకే సరిగ్గా అర్థంకాదు. మన గుండెలో ఏ క్షణం ఎంత రక్తం పంపింగ్ అవుతుందో తెలియదు.. పరీక్షల్లో తప్ప. కాబట్టి, ఇంట్లో ఉన్న సమస్యల వల్ల ఒక్కోసారి స్త్రీలకు అకాలమరణం సంభవించవచ్చు. ఒక్కోచోట ఆ వీధి, వీధి అంతా ఇలాంటి సమస్యలే కనిపించవచ్చు. కారణం.. ఆ వీధికి ఉండే వక్రత. అలా కట్టిన గృహాలు కాబట్టి, ఇంటిలో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి తేలిగ్గా తీసుకోవద్దు.
– సి. పద్మ, చౌటుప్పల్.
షాపు ఉత్తరం ముఖంగా ఉన్నప్పుడు అందులో కస్టమర్లకు అనుకూలంగా దుకాణం యజమాని కూర్చోవాల్సి ఉంటుంది. కాబట్టి, ఆ షాపులో వాయవ్యంలో తూర్పు ముఖంగా కూర్చునేలా టేబుల్ – చైరు వేసుకోవాలి. అప్పుడు షాపు అంతా అతని పర్యవేక్షణలో సాగుతుంది. గల్లాపెట్టె (క్యాష్ డ్రా)ను కుడిచేతి వైపు వచ్చేలా అమర్చుకోవాలి. ఆ షాపులో నైరుతిలోనే కూర్చోవాలి అని అనుకోకూడదు. దక్షిణ – పశ్చిమ సెల్ఫ్‌లు కట్టి.. మీ వస్తువులను అమర్చుకోవాలి. ప్రధాన ద్వారం అనగా.. ఉత్తరం షాపునకు ఎంట్రీ ఈశాన్యంలో పెట్టుకొని ఆ షాపులో ఉత్తర వాయవ్య భాగం గ్లాసు పెట్టుకోవాలి. తద్వారా ఉచ్ఛమైన నడక ఏర్పడి షాపు చక్కగా సాగుతుంది.
– సి.హెచ్. దీప్తి, సంతోష్‌నగర్.
నైరుతిభాగం ఓపెన్‌గా పెట్టవద్దు. అది ఒక గదిగా ఉండాలి. కుక్కర్ మూత లేకుండా ఓపెన్‌గా ఉండాలి అంటే ఎంత అర్థరహితమో.. నైరుతి గది ఓపెన్‌గా హాల్లో కలిసిపోవాలి అనుకోవడం కూడా అంతే! కొన్ని దిశలు మూస్తే పట్టు. కొన్ని దిశలు మూయకపోతే పట్టు కలిగి ఉంటాయి.
అందుకే ఇంద్రియ ప్రాధాన్యాన్ని బట్టి కంటి రెప్పలు, చెవులకు డొప్పలు పెట్టింది ప్రకృతి. అదే మనకు అవకాశం ఉంటే.. ఇది అటు – అది ఇటు చేసేవాళ్లమేమో! శాస్త్రం ఎప్పుడూ.. ‘ఇంటిలోని హాల్ ఎప్పుడూ కూడా ఈశాన్యం కలుపుకొన్నది ఉండాలి’ అంటుంది. అలాగే దక్షిణం నుంచి ఉత్తరం లేదా తూర్పు నుంచి పశ్చిమం ఒకే దీర్ఘచతురస్రం కలిగిన హాల్ రావడం ఆ ఇంటికి మహర్దశను ఇస్తుంది.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143