– కె. ధనుంజయ, కొత్తకోట.
వాస్తు గృహం అనగానే.. తల్లి చంకలో పసి పిల్లవాడిలాంటి జీవితం ఉండదు. చెరువులో బోటు తొక్కుతూ ఆవలి తీరానికి చేరినట్టుగానే ఉంటుంది. నీటిలో బోటు మునగదు. కానీ, ముందుకు సాగాలంటే దానిని తొక్కడం లేదా తెడ్డు వేస్తూ పోవడం తప్పదు. అలాగే, శాస్త్రగృహ జీవనం కూడా! ‘అన్నీ అదే ఇస్తుంది. నేను కూర్చుని తింటూ సుఖపడతాను!’ అనుకోవద్దు. మన ప్రయత్నం అనేది అంతటా అవసరమే! మానవశ్రమకు నిజాయతీ కలిగిన సంకల్పానికి ప్రకృతి ఎప్పుడూ సహాయం చేస్తుంది. ‘గ్రహస్థితి’ అనేది నువ్వు నేలమీదికి రాకముందే నీకు నిర్ధారణ చేసి ఉంచుతుంది.
దానిని ఏ మనిషీ వెనక్కి వెళ్లి మార్చుకోలేడు. అది అసాధ్యం. కానీ, వాటి ఫలితాలను తగ్గించి, వాటి తీవ్రతను తొలగించి యోగ్యమైన గృహ జీవనంతో.. గ్రహస్థితిని గృహస్థితి మార్చగలుగుతుంది. అందుకు వచ్చింది వాస్తుశాస్త్రం. విధి అనేది అర్థంకాని మాటకాదు. అది నీ జన్మ స్వభావం. అలాంటి మానవ స్వభావంతో ఇంటిని ఎంచుకుంటాడు. అదే సుఖదుఃఖాలకు కారణం అవుతుంది. మనిషి సంక్లిష్టత మరేదో కాదు. జన్మగతమైన కార్యకలాపాల వలలో చిక్కుకుపోయి నేల మీదికి రావడం, అది తనకు అర్థం కాకపోవడం, దానిని తన విధిగా, కర్మగా భావించడం… ఇది మనిషిని వెన్నంటి ఉన్న వలయం.
అందుకే, అతీంద్రియ జ్ఞాన సంపన్నులు అయిన మన ప్రాచీన రుషులు.. వ్యక్తి సుఖదుఃఖాలను క్రమబద్ధం చేసి, తన గత ప్రకృతి నిర్ణయ ఫలితాలను నేటి ప్రకృతి మార్పుచేర్పులతో సవరించి.. నిన్న ఎక్కడో బయట తిన్న ఫుడ్ పాయిజన్‌ను నేడు మందులిచ్చి హరించి వేసినట్టుగా, గృహ నిర్మాణ రహస్యాలను పంచభూతాల నిగూఢ విజ్ఞాన సారాన్ని మధించి సూత్రబద్ధం చేసి, వాస్తురూపంలో మనకు అందించారు. దీనిని ఎంత ప్రాక్టికల్‌గా చేశావు? ఎంతవరకు పాటించావు? అన్నదానిని బట్టి, నేటి జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకే, వ్యక్తి బుద్ధిని, స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టే, మార్చలేని గ్రహస్థితిని గృహస్థితి మారుస్తుంది.
– ఎస్. కృష్ణ, చాడ.
అపార్ట్మెంట్లలో చాలాచోట్ల కార్లు ఫ్రీగా రావాలని మూడు గేట్లు, రెండు గేట్లు లేదా మొత్తం ఓపెన్ పెట్టి ఉంచుతారు. ఎన్ని గేట్లు కావాలో అపార్ట్‌మెంట్‌కు ఉన్న రోడ్లను అనుసరించి నిర్ధారించాలి. అపార్ట్‌మెంట్‌కు ఎన్ని రోడ్లు ఉన్నాకూడా.. ఒక రోడ్డు దిక్కు రెండు గేట్లే పెట్టాలి. మూడు గేట్లు పెట్టవద్దు.
రెండు గేట్లనూ ఉచ్ఛమైన స్థానాల్లోనే పెట్టాలి. ఉత్తర – ఈశాన్యంలో ఒకటి, ఉత్తర – వాయవ్యంలో మరొకటి పెట్టకూడదు. రెండు రోడ్లు ఉంటే.. ఆయా దిక్కులకు రెండు రెండు గేట్లు పెట్టుకొని వాడుకోవచ్చు. ఏ దిశకైనా నీచస్థానం అనేది ఉంటుంది. అలాంటి స్థానాలు నైరుతి – ఆగ్నేయం – వాయవ్యం. ఈ దిశల్లో గేట్లు రాకుండా, జాగ్రత్తగా నిర్ధారించి గేట్లు పెట్టుకోవచ్చు.
– సీహెచ్. రమేశ్, కల్లూరు.
స్థలాన్ని ముందుగా చతురస్రంగా లేదా దీర్ఘ చతురస్రంగా చేసుకోండి. ఉత్తరంవైపు ఈశాన్యం పెరిగి ఉంటే.. రోడ్డును అనుసరించి తూర్పు – పడమరగా ఎంత పొడవు స్థలం వస్తుందో చూసుకొని, దానిని మూలమట్టంగా సరిచేసుకొని, అందులో ఇల్లు కట్టుకోవచ్చు. స్థలం ఉత్తర – ఈశాన్యం పెరగడం అనేది.. వినడానికి బాగుంటుంది. కానీ, అది ‘ఎల్’ ఆకారంలో ఉన్నప్పుడు కొలతకు ఆ స్థలాన్ని సరిచేయాలి. ముఖ్యంగా రోడ్డును అనుసరించి ఇల్లు కట్టుకోవడానికి అది ‘సరిపోయే కొలత’యేనా అన్నది నిర్ధారించాలి. అలా తూర్పు – పడమర వచ్చే కొలతలో ఇంటి చుట్టూ ఖాళీ ఉండేలా పశ్చిమ ముఖంగా ఇల్లు కట్టుకోవచ్చు. అయితే, ఇంటికి ముందు కాంపౌండ్ కట్టాలి. అప్పుడు స్థలం నిలబడుతుంది.అన్నీ చూసుకొని కట్టండి.
– బి. రాధ, నర్మాల.
రోడ్లు ఎదురుగా వచ్చినప్పుడు ఆ ఇంటిని, ఆయా రోడ్ల నడకను చాలా జాగ్రత్తగా చూడాలి. కొన్ని మంచివి (వీధి చూపులు), కొన్ని చెడ్డవి (వీధిపోట్లు) అనేది మీకు తెలిసి ఉన్నా.. మంచిగా అనుకునే రోడ్లుకూడా వాటి నడకలు, అవి పడే స్థానాలు వేరుగా ఉంటాయి. జాగ్రత్తగా పరిశీలించాలి. ఈశాన్యంగా వచ్చే వీధిచూపు మంచిది అనుకుంటాం. అయితే, ఆ రోడ్డు వంకరగా వచ్చి, ఇంటికి ఆగ్నేయంలో పడవచ్చు.
అలాగే, దక్షిణ – ఆగ్నేయంగా వచ్చే రోడ్డు కాస్త క్రాస్‌గా వచ్చి.. ఇంటికి దక్షిణ – నైరుతిలో పడవచ్చు. ఇవి ప్రమాదకరం. అలాగే, రోడ్లు వీధి చూపులు అని నిర్ధారించుకున్నా.. ఆ రోడ్లు దిశలకు లేనప్పుడు కూడా ఎంతో నష్టం జరుగుతుంది. కేవలం తూర్పు రోడ్డు ఉంది.. అది ఎదురుగా సెంటర్లా పడుతుంది. ఉత్తరం రోడ్డు సెంటర్లో ఇంటికి పడుతుంది అనేది మంచిదే కానీ, ఆ ఇల్లు విదిక్కులకు ఉంటే.. అప్పుడు ఆ వీధులు మారిపోతాయి. అన్నీ చూసుకొని కొనాలి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143