మా అన్న ఇల్లు పడమరలో ఉంది. దాని పాదుకన్నా మా ఇల్లు దక్షిణం జరిగింది. దక్షిణం రోడ్డు ఉంది. దోషమా? కోమటి వీరభద్రం, సంగారెడ్డి
అన్నదమ్ములు ఒకరి వెనుక ఒకరు ఇండ్లు కట్టుకున్నప్పుడు అన్నీ చూసుకొని కట్టుకోవాలి. ముఖ్యంగా దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ముందు ఎవరైతే ఇల్లు కట్టి ఉంటారో వాళ్లను మిగతా వారు అనుసరించాల్సి వస్తుంది. దక్షిణం రోడ్డు పరిధిని స్థిరపరచుకొని ప్రహరీని ముందు నిర్ణయించాలి. దాని లోపలే ఇల్లు కట్టాలి. ఈ ఇంటికి తూర్పువైపు కట్టేవాళ్లు.. అతడు తమ్ముడు కావచ్చు, ఇతరులు కావచ్చు. పై భాగంలో ఉన్న పడమర ఇంటి ప్రహరీలో పాదును అనుసరించి కట్టాల్సిందే. మీ ఇల్లు ‘దక్షిణం జరిగింది’ అంటే, మీ అన్నగారు వెనక్కి జరిపారు. అప్పుడు మీకు దక్షిణ నైరుతిలో ‘వీధిపోటు’ పడుతుంది. అది మీకు పెద్ద దోషమే అవుతుంది. మీ అన్నగారు దక్షిణంలో స్థలం వదిలి కట్టారు అంటే, అతనికి ప్రహరీ లేకుండా మీ ఇంటి ప్రహరీ పాదుతో సమానంగా తనూ ప్రహరీ కడితే సరిపోతుంది. లేదా అతని ఇల్లు పెంచుకున్నా మంచిదే. ఏది అవకాశం ఉంటే అది చూసుకొని, ఇద్దరూ సరి చేసుకోండి.
మాకు పడమర రోడ్డు నైరుతి పెరుగుతూ పోయింది. ఇల్లు ఎలా కట్టాలి? వసుంధర, సత్తుపల్లి
పశ్చిమ నైరుతి పెరిగిన రోడ్డు ఉన్నప్పుడు ఆ వీధి అంతా వరుసగా అందరికీ అవి స్థలాలు అయినా, ఇండ్లు అయినా నైరుతిలో పెరిగి ఉంటాయి. మీరు ఇల్లు కట్టలేదు కాబట్టి, ముందుగా మీకు ఎడమవైపు అంటే, మీ ఇంటి ఉత్తరం వాళ్లు కట్టిన ఇంటి లైను చూడండి. వాళ్లు తమ నైరుతిని సరి చేసుకొని కట్టుకుంటే దాని లైన్తో ముందుగా మీ స్థలాన్ని వెనక్కి జరిపి పెరిగిన నైరుతిని రోడ్డులోకి వదలండి. అప్పుడు మీ స్థలం చతురస్రమో, దీర్ఘ చతురస్రమో వస్తుంది. దానిలో మీ ఇంటిని ప్లాను చేసుకోండి. పక్కవాళ్లు సరి చేయకుండా కట్టి ఉంటే, వాళ్లను అనుసరించవద్దు. రేపు వాళ్లు తమ దోషం తెలుసుకొని ఎలా సవరిస్తారో లెక్కించుకొని ఆ లైనుకు ఇప్పుడు మనం వెనక్కి జరగాలి. లేదంటే, పడమర వాయవ్యం వీధిపోటు పడుతుంది. అన్ని విధాలుగా చూసుకొని మంచి ఇల్లు కట్టండి.
ఇంటికి అనుకూలంగా మన వరకే రోడ్లు వేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయా? వంశీ, నిర్మల్
గృహం, దాని వీధులు సహజంగా నగర సంబంధంగా లేదా గ్రామం ‘నక్ష ప్రకారం’ వస్తుంటాయి. అవి ప్రజాబలంతో ఇమిడి ఉంటాయి. వాటికే సర్వశక్తులు ఉంటాయి. మనం మన ఇంటికి అనుకూలంగా రోడ్లు వేసుకొని వాటిని జనం నడిచే వీధులకు అనుసంధానం చేయాలి. అప్పుడు అవి బలంగా పని చేస్తాయి. వీధులు వేస్తారు కానీ, పక్క కాలనీకే కలుపకుండా కొందరు గేట్లతో, గోడలతో మూసి వేస్తుంటారు. తద్వారా ‘మా కాలనీ బాగుంటుంది’ అనుకుంటారు. అలా, కాలనీ ఈశాన్యం వీధిని మూసుకుంటారు. అది వీళ్లకు బాగనిపించినా శాస్త్ర ప్రకారం దోషం. మన ఇంటి ‘ప్రైవసీ’ కోసం కాదు వీధి. అందరికీ ఉపయోగపడే వీధి అయినప్పుడే ‘శక్తి’ జనం నడకతో ఉన్న మంచి రోడ్డు గొప్ప ప్రభావం చూపుతుంది.
మాది పాత ఇల్లు. కొన్ని గోడలు వంకరగా ఉన్నాయి. వాటిని ఉంచాలా, తీసి కట్టాలా? వంగర శ్రీనివాస్, సీతాఫల్మండి
కొన్ని ఇండ్ల స్థలం ఎలా ఉంటే అలా కడతారు. ఈశాన్యం కోణంగా పెరిగిన స్థలం ఉంటే అది మంచిదని అలాగే గోడలు కట్టి వాడుతుంటారు. కొన్నాళ్లకు ఆ ఇంట్లో స్త్రీలు కాన్సర్తో, కీళ్ల నొప్పులతో బాధలు పడుతారు. మన ఊర్లలో ఎడ్లబండ్లు ఉంటాయి. వాటిమీద చెరకు, ధాన్యం బస్తాలు వేసి మార్కెట్లకు పంపుతుంటారు. ఆ బండ్లమీద లోడు ఒక పద్ధతిలో వేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ బండి ఒకవైపు ఒరుగకుండా ఉంటుంది. నేచర్లో ఇల్లుకూడా అంతే. గోడలు సమభుజాలతో ఉన్న గృహం అయినప్పుడే, అది మన జీవన ప్రమాణాన్ని సజీవంగా నడిపిస్తుంది. వక్రమైన గోడలు భయంకర అనారోగ్యాలను సృష్టిస్తాయి. చాలా తొందరగా మీరు మీ ఇంటి గోడలు సరి చేసి కొలతల ప్రకారం కట్టుకోండి. నిర్లక్ష్యం మంచిది కాదు.
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678