కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు ప్రపంచంలో చాలామంది రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నారు. మరికొంతమంది బూస్టర్ డోస్కూడా వేసుకున్నారు. అయితే, జర్మనీకి చెందిన ఓ వృద్ధుడు మాత్రం 90 సార్లు వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఎందుకో తెలుసా? పైసల కోసం.. అదేంటి వ్యాక్సిన్ తీసుకుంటే డబ్బులిస్తారా? అనేదే కదా మీ అనుమానం. డబ్బులు ఇవ్వరుగానీ కొవిడ్ సర్టిఫికెట్ ఇస్తారు కదా.. ఆ సర్టిఫికెట్‌ను ఫోర్జరీ చేసి అవసరమున్నవారికి అమ్మి సొమ్ము చేసుకుంటున్నాడు.
జర్మనీలో ప్రయాణాలకు, ఇతర కార్యక్రమాలకు హాజరుకావాలంటే కొవిడ్ సర్టిఫికెట్ తప్పనిసరి. అక్కడ కొంతమంది వ్యాక్సిన్ వేసుకోలేదు. అలాంటివారు సర్టిఫికెట్లను కొనుగోలు చేస్తున్నారు. దీన్నే ఆ వృద్ధుడు ఆదాయమార్గంగా మలుచుకున్నాడు. సక్సోనీ రాష్ట్రంలో వేర్వేరు చోట్ల టీకాలు తీసుకుంటూ సర్టిఫికెట్ తీసుకుంటున్నాడు. సర్టిఫికెట్ అవసరమున్నవారికి వారిపేరుతో ఫోర్జరీ చేసి అమ్ముతున్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు నిఘాపెట్టారు. సాక్సోనీ రాష్ట్రంలోని ఎలెన్‌బర్గ్ సెంటర్లో సదరు వృద్ధుడు వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే, ఇన్నిసార్లు వ్యాక్సిన్ వేసుకున్నా అతడి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపలేదా? అనేదానిపై మాత్రం ఇప్పటివరకూ స్పష్టత లేదు.