ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఒక ఫొటో చాలా మంది మనసులను కదిలించింది. ఈ ఫొటోలో నున్నటి గండుతో ఉన్న అర్ష్ నందన్ ప్రసాద్ అనే వ్యక్తి ఒక ల్యాప్‌టాప్ ముందు కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో అతను ఆస్పత్రి బెడ్‌పై ఉండటం గమనార్హం. ఈ ఫొటోను షేర్ చేసిన నందన్ ప్రసాద్.. తను కీమో థెరపీ సెషన్ కోసం వచ్చి, ఈ ఇంటర్వ్యూలో పాల్గొంటున్నట్లు తెలిపాడు.
అలాగే తనకు కేన్సర్ అని తెలిసి చాలా కంపెనీలు ఉద్యోగం ఇవ్వలేదని వెల్లడించాడు. ‘‘ఇంటర్వ్యూలో నువ్వు చెయ్యగలిగినంతా చేసిన తర్వాత.. జీవితంలో కష్టాలు ఎదుర్కొంటున్నాననే ఒకే ఒక కారణంతో ఉద్యోగం దొరక్కపోవడం ఎంత బాధగా ఉంటుంది? ఈ విషయం ఒక్కటి చాలు ఈ బడా కంపెనీలు ఎంత జాలి చూపిస్తాయో చెప్పడానికి’’ అని పోస్టు పెట్టాడు.
తను కేన్సర్‌తో పోరాడుతున్నానని తెలియగానే రిక్రూటర్ల మొఖకవళికలు మారిపోతాయని, తనకు వాళ్ల జాలి అక్కర్లేదని నందన్ ప్రసాద్ అన్నాడు. తన సత్తా నిరూపించుకోవడానికే తను వచ్చానని స్పష్టం చేశాడు. మహారాష్ట్రకు చెందిన అప్లయిడ్ క్లౌడ్ కంప్యూటింగ్ అనే కంపెనీ సీఈవో నీలేష్ సత్పుతే.. ఈ పోస్టు చూశారు.
వెంటనే నందన్ ప్రసాద్‌కు రిప్లై ఇచ్చిన ఆయన.. ‘‘నువ్వొక యోధుడువి. దయచేసి ఇలా ట్రీట్మెంట్ మధ్యలో ఇంటర్వ్యూలకు అటెండ్ అవడం మానుకో. నీ అర్హతలన్నీ నేను చెక్ చేశాను. అవి చాలా బలంగా ఉన్నాయి. మా కంపెనీలో నీకు ఉద్యోగం ఇస్తాను. ఇంటర్వ్యూ కూడా అక్కర్లేదు. నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి జాయిన్ అవ్వు’’ అని ఆఫర్ ఇచ్చాడు.
ఈ క్రమంలో నందన్ ప్రసాద్‌కు చాలా మంది మద్దతుగా నిలిచారు. కొందరు తమ కష్టాలు చెప్పి అతనికి ధైర్యం తెచ్చేందుకు ప్రయత్నించారు. మరికొందరు అతని పట్టుదలను మెచ్చుకున్నారు.