న్యూఢిల్లీ : బతుకు బండి సాఫీగా సాగేందుకు అందరూ ఏదో ఒక పనిచేసి పొట్టపోసుకోక తప్పదు. కానీ జానెడు పొట్ట కోసం ప్రాణాలనే పణంగా పెట్టి పనిచేయాల్సిన పరిస్ధితుల్లోనూ చాలా మంది బతుకువెళ్లదీస్తున్నారు. నిర్మాణ రంగంలో పనిచేసే ఓ కూలీ ఎత్తైన భవన నిర్మాణ పనుల్లో అత్యంత ప్రమాదకరంగా ఐరన్ ప్లేట్ అంచున కూర్చుని పనిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
He needs appreciation and all praise… pic.twitter.com/fVcUqsJFIC
— Dr Showkat Shah (@shahshowkat07) January 8, 2023
ఈ వైరల్ వీడియోను డాక్టర్ షౌకత్ షా ట్విట్టర్లో షేర్ చేశారు. 11 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియోలో భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదకర పరిస్ధితిలో పనిచేస్తుండటం నెటిజన్లకు ఆగ్రహం కలిగించింది. అతడి శ్రమకు అందరి ప్రశంసలు దక్కాలి అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇవ్వగా ఈ వీడియోను ఇప్పటివరకూ 5 లక్షల మందికి పైగా వీక్షించారు.
ఆ వ్యక్తి అంత ప్రమాదకర పరిస్ధితిలో పనిచేయడం ఏమిటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని పలువురు యూజర్లు డిమాండ్ చేశారు. ఎవరి ప్రశంసలు కోసమో అతడు ఇలా చేయడం లేదు..జీవనోపాధి కోసమే ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాడని ఓ యూజర్ రాసుకొచ్చారు. అతడికి భద్రత కల్పించేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని మరో నెటిజన్ కామెంట్ చేశారు.